ఏప్రిల్ 4నే జేఈఈ మెయిన్
ఏప్రిల్ 4నే జేఈఈ మెయిన్
Published Sat, Nov 8 2014 12:35 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM
ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పరీక్ష తేదీలు మార్పు
ఏప్రిల్ 6కు బదులు 4వ తేదీనే రాత పరీక్ష నిర్వహణ
తెలంగాణలో కేంద్రాలు
రాత పరీక్షతోపాటు ఆన్‌లైన్ పరీక్ష హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఏర్పాటు చేసే కేంద్రాల్లో రెండూ ఉంటాయి. కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండలో మాత్రం ఆన్‌లైన్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తారు.
ఆన్‌లైన్ పరీక్ష రెండు రోజులకే పరిమితం
ఏప్రిల్ 10, 11 తేదీల్లోనే
ఆన్‌లైన్ పరీక్షలు
ఏపీలో 22 కేంద్రాల్లో,
తెలంగాణలో 6 కేంద్రాల్లోనే పరీక్షలు
ఇన్‌ఫర్మేషన్ బ్రోచర్ విడుదల, దరఖాస్తులకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థలైన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీల్లో (ట్రిపుల్ ఐటీ) వచ్చే ఏడాది ప్రవేశాల కోసం సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్ష తేదీలు మారాయి. వచ్చే ఏప్రిల్ 6న రాత పరీక్షను, 9, 11, 12, 19 తేదీల్లో ఆన్‌లైన్ పరీక్షను నిర్వహిస్తామని మొదట తమ వెబ్‌సైట్‌లో ప్రకటించిన సీబీఎస్‌ఈ శుక్రవారం జారీ చేసిన ఇన్‌ఫర్మేషన్ బ్రోచర్‌లో పరీక్ష తేదీలను మార్పు చేసింది. రాత పరీక్షను ఏప్రిల్ 4వ తేదీనాడే నిర్వహిస్తామని ప్రకటించింది. ఆన్‌లైన్ పరీక్షను కూడా రెండు రోజులకే పరిమితం చేసి ఏప్రిల్ 10, 11 తేదీల్లో నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 22 కేంద్రాలను, తెలంగాణలో 6 కేంద్రాలను పరీక్షల నిర్వహణకు ఎంపిక చేసింది. విద్యార్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు శుక్రవారం నుంచి అవకాశం కల్పించింది. ఈనెల 18వ తేదీవరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా 30 ఎన్‌ఐటీలు, 9 ట్రిపుల్ ఐటీలు, 15 ఇతర ప్రభుత్వ సహాయం పొందే జాతీయ, రాష్ట్ర స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
జూన్ 25లోపు ఇంటర్ మార్కులు ఇవ్వాల్సిందే..
జేఈఈ మెయిన్ తుది ర్యాంకు ఖరారులో జేఈఈ మెయిన్ పరీక్షలో వచ్చిన మార్కులకు 60 శాతం వెయిటేజీ, ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి జేఈఈ మెయిన్ తుది ర్యాంకును ఖరారు చేస్తారు. ఆ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అయితే ఈసారి జూన్ 25వ తేదీలోగా అన్ని రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డులు తమ విద్యార్థుల మార్కులను సీబీఎస్‌ఈకి అందజేయాలి. జూన్ 25 తరువాత మార్కుల వివరాలు వస్తాయని అనుకునే విద్యార్థులు మెయిన్ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఫలితాల వెల్లడి, రీవ్యాల్యుయేషన్, రీవెరిఫికేషన్‌కు సంబంధించిన అన్ని ఫలితాలను జూన్ 25లోగా ప్రకటించాల్సిందే. ఆ తరువాత విద్యార్థుల వివరాలు ఇస్తామంటే కుదరదు. నిర్ణీత వ్యవధిలో సంబంధిత బోర్డుల నుంచి అందిన మార్కులను పరిగణనలోకి తుది ర్యాంకులను ప్రకటిస్తారు. గత ఏడాది జులై 25 వరకు కూడా విద్యార్థుల ఇంటర్ మార్కులను స్వీకరించగా, ఈసారి అది కుదరదు. ఈ లెక్కన ఇంటర్మీడి యట్ అడ్వాన్స్‌డ్ పరీక్షలను ఈసారి మరింత ముందుగా నిర్వహించాల్సి వస్తుంది.
జేఈఈ మెయిన్ షెడ్యూలు ప్రధాన వివరాలు..
నవంబరు 7 నుంచి దరఖాస్తులు ప్రారంభం.
నవంబరు 18: దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ.
మార్చి 1 నుంచి హాల్ టికెట్లకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది.
ఏప్రిల్ 4వ తేదీన ఆఫ్‌లైన్ రాత పరీక్ష, బీఈ/బీటెక్ కోసం పేపరు-1 పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు. బీఆర్క్/బీప్లానింగ్ కోసం పేపరు-2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.
ఏప్రిల్ 10, 11 తేదీల్లో ఆన్‌లైన్ పరీక్ష.
పరీక్షలో నెగిటివ్‌మార్కులుంటాయి. తప్పుడు సమా ధానం రాస్తే ప్రతి ప్రశ్నకు 1 మార్కు కోత పడుతుంది.
Advertisement
Advertisement