అక్షర శిఖరం అస్తమయం | Jnanpith award winner Ravuri Bharadwaja passes away | Sakshi
Sakshi News home page

అక్షర శిఖరం అస్తమయం

Published Sat, Oct 19 2013 1:14 AM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM

ఇటీవల జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న రావూరి భరద్వాజ

ఇటీవల జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న రావూరి భరద్వాజ

 అనారోగ్యంతో కన్నుమూసినరావూరి భరద్వాజ
 రచనల్లో కష్టజీవులకు పట్టం క ట్టిన అక్షర తపస్వి
 జ్ఞాన్‌పీఠ్ సహా పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు
 నేడు హైదరాబాద్‌లో అంత్యక్రియలు
 జగ న్‌మోహన్‌రెడ్డి సహా పలువురు ప్రముఖుల సంతాపం
 
సాక్షి, హైదరాబాద్: అక్షర కర్షకుడి శ్వాస ఆగిపోయింది. అట్టడుగు బతుకులను సాహిత్యమయం చేసిన అపురూప కలం నిలిచిపోయింది. ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ(87) ఇకలేరు. శుక్రవారం రాత్రి ఇక్కడి బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో ఆయన తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. మధుమేహం, అధిక రక్తపోటు, మెడవద్ద ఫ్య్రాక్చర్, గుండె, కిడ్నీల వైఫల్యం, కడుపులో ఇన్‌ఫెక్షన్‌లతో బాధపడుతున్న రావూరి రాత్రి 8.35 గంటలకు మృతిచెందారు. ఈ నెల 14న ఆస్పత్రిలో చేరిన ఆయనను ఐదు రోజులు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచారు.

రావూరికి నలుగురు కుమారులు రవీంద్రనాథ్, గోపీచంద్, బాలాజీ, కోటీశ్వరరావు ఉన్నారు. కుమార్తె పద్మావతి ఇటీవలే మృతి చెందారు. సతీమణి కాంతం 1986లోనే కన్నుమూశారు. రావూరి కళ్లను ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి దానం చేసి, భౌతిక కాయాన్ని విజయనగర్ కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించారు. శనివారం మధ్యాహ్నం 12గంటలకు హుమాయూన్ నగర్‌లోని దేవునికుంట హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

జీవనయానం
దేశ సాహిత్యరంగంలో అత్యున్నత పురస్కారమైన ‘జ్ఞానపీఠ్’ వరించిన ఆరు నెలలకే రావూరి కన్నుమూయడం పాఠకులను కలచివేసింది. రచనే శ్వాసగా జీవించిన రావూరి 1927 జూలై 5న కృష్ణాజిల్లా నందిగామ తాలూకా మొగులూరులో జన్మించారు. ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు. ఆయనపై ప్రముఖ రచయిత చలం ప్రభావం ఎక్కువగా ఉండేది. రావూరి రెండవ ప్రపంచ యుద్ధంలో టెక్నీషియన్‌గా పని చేశారు. కడుపు నింపుకోవడానికి ఫ్యాక్టరీల్లో, ప్రింటింగ్ ప్రెస్సుల్లో కూలిపని చేశారు. స్వాతంత్య్రానికి ముందు ‘జమీన్‌రైతు’ పత్రికలో పాత్రికేయుడిగా చేరారు. 1959లో ఆల్ ఇండియా రేడియాలో స్క్రిప్ట్ రైటర్‌గా చేరి 1987లో ఆ సంస్థలోనే పదవీ విరమణ చేశారు.
 
అక్షరయానం
రావూరి చిన్నప్పుడే చదువు మానేసినా జీవితాన్ని మాత్రం జీవితాంతం వరకు చదివారు. కుగ్రామంలో జన్మించిన ఆ అక్షర తపస్వి లైబ్రరీల్లో జ్ఞానదాహాన్ని తీర్చుకున్నారు. పస్తులు, ఆణాకానీ ఉద్యోగాల మధ్యే రచయితగా అడుగులు వేశారు. తన చుట్టూ ఉన్న పీడిత ప్రజల కష్టనష్టాలను అక్షరాలకెక్కిం చారు. నవలలు, కథలు, పిల్లల కథలు విస్తృతంగా రాశారు. 140కిపైగా రచనలు చేశారు. వీటిలో 43 కథాసంపుటాలు, 19 నవలలు, 7 నవలికలు ఉన్నాయి. కాయకష్టం చేసుకునే మూమూలు మనుషుల జీవితాలను ఆర్ద్రంగా కళ్లకు కట్టిన ‘జీవన సమరం’ రావూరి కలం సత్తా ఏంటో చాటింది. దీనికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అ వార్డు దక్కింది. 

సినీ జీవితంలోని చీకటి వెలుగులను అద్భుతంగా చిత్రిం చిన ‘పాకుడురాళ్లు’, ‘కాదంబరి’ తదితర రచనలు ఆయనకు పేరు ప్రఖ్యాతులను తెచ్చా యి. 2012 ఏడాదిగాను పాకుడురాళ్లు నవలను జ్ఞానపీఠ్ పురస్కారం వరిం చింది. విశ్వనాథ సత్యనారాయణ, డాక్టర్ సి.నారాయణరె డ్డిల తర్వాత ఈ పురస్కారాన్ని అందుకున్న తెలుగు రచయిత రావూరే. రావూరి ఇటీవల ఢిల్లీలో ఈ అవార్డు అందుకున్నారు. రావూరిని కేంద్రసాహిత్య అకాడమీ అవార్డుతో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ, నాగార్జున వర్సిటీలు గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి.  
 
గవర్నర్, సీఎం, బొత్స సంతాపాలు
రావూరి మృతికి గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సంతాపం తెలిపారు. రావూరి మరణం సమాజానికి తీరని లోటని గవర్నర్ పేర్కొన్నారు. మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, డీకే ఆరుణ , టీడీపీ అధినేత చంద్రబాబు, మండలి బుద్ధ ప్రసాద్, విద్యావేత్త చుక్కా రామయ్య, డాక్టర్ సీ నారాయణరెడ్డి, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు తదితరులు కూడా జోహార్లు అర్పించారు.
 
ఆయన రచన మట్టి పరిమళం: జగన్‌మోహన్‌రెడ్డి
అక్షర దిగ్గజం రావూరి భరద్వాజ మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. దేశ సాహిత్యంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ రావూరి ఇంటి తలుపుతట్టిన ఆరు నెలలకే ఆయన దైవంలో ఐక్యం అయ్యారని సంతాప సందేశంలో పేర్కొన్నారు.

‘రావూరి అక్షరం.. వాన చినుకు మట్టిబెడ్డను తాకితే ఆ మట్టి వెదజల్లే పరిమళం. ఆయన రచ న అధోజగత్తు గుండె చప్పుడు. ఆయనకు రచన ఒక వ్యాపకం కాదు, దీక్ష. ఆయన జీవితం నిష్టతో కూడిన సందేశం. జ్ఞానపీఠ్‌ను స్వీకరించిన కొద్ది రోజులకే ఆయన భౌతికంగా కనుమరుగవడం బాధాకరం. రావూరి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఆయన కుటుంబానికి సానుభూతిని తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement