సాక్షి, విశాఖపట్నం/విశాఖ లీగల్: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు మానసిక వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. శ్రీనివాసరావుకు జ్యుడీషియల్ రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించింది. పోలీసులు నిందితుడిని శుక్రవారం అడవివరం జైలు నుంచి ప్రత్యేక బందోబస్తు మధ్య విశాఖపట్నం మూడో అదనపు మెజిస్ట్రేట్ న్యాయస్థానానికి తీసుకువచ్చారు.
ఈ కేసును విచారించిన మెజిస్ట్రేట్ ఈనెల 23 వరకు నిందితుడి రిమాండ్‌కు ఆదేశాలిచ్చారు. దీంతో పోలీసులు అతడిని సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా ఈ కేసులో శ్రీనివాసరావు తరఫు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ జిల్లా కోర్టు నుంచి మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి కోర్టుకు బదిలీ చేశారు. ఈ బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశముందని నిందితుడి తరఫు న్యాయవాది సలీమ్ విలేకరులకు తెలిపారు.
నిందితుడి మానసిక పరిస్థితి బాగా లేనందున విశాఖ మానసిక ఆస్పత్రి నుంచి ప్రత్యేక వైద్య బృందాన్ని పంపి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అనుమతినివ్వాలని కోరుతూ తాను వేసిన సీఆర్‌పీసీ 328 పిటిషన్‌ను మెజిస్ట్రేట్ తిరస్కరించారని ఆయన వెల్లడించారు. నిందితునికి ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు, ప్రత్యేక వైద్య పరీక్షలు కావాలనుకున్నప్పుడు నిందితుడే స్వయంగా పిటిషన్ వేయాలి తప్ప నిందితుని తరుఫున పిటిషన్ ఇస్తే పరిగణనలోకి తీసుకోబోమని కోర్టు పేర్కొన్నట్లు తెలిపారు.
ప్రత్యక్ష సాక్షుల విచారణ కోసం మెమో
ఈ కేసులో ఇప్పటివరకు వాంగ్మూలం ఇవ్వని ప్రత్యక్ష సాక్షులకు సీఆర్‌పీసీ 164 కింద నోటీసులు ఇచ్చేందుకు అనుమతినివ్వాలని సిట్ తరుఫున మెమో ఫైల్ చేశారు. తమ ఎదుట వాంగ్మూలం ఇవ్వని వారు మెజిస్ట్రేట్ ఎదుట వారి వాంగ్మూలం రికార్డు చేసేందుకు వీలుగా పోలీసులు నోటీసులు జారీ చేస్తారు.
ప్రత్యక్ష సాక్షులతో పాటు నిందితుడికి లేఖరాసేందుకు సహకరించినవారికి, ఫ్లెక్సీ తయారు చేసినవారు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, తనతో పాటు పనిచేసిన సహచర ఉద్యోగుల నుంచి కూడా మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం తీసుకొనే వీలుగా సీఆర్‌పీసీ 164 కింద నోటీసులు ఇవ్వనున్నారు. ఈ విధంగా సాక్షులతో పాటు 30 మందికి నోటీసులు ఇచ్చేందుకు అనుమతి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment