ఓపిక పట్టాల్సిందే | Junior doctors start strike | Sakshi
Sakshi News home page

ఓపిక పట్టాల్సిందే

Nov 27 2014 3:49 AM | Updated on Sep 2 2017 5:10 PM

ఓపిక పట్టాల్సిందే

ఓపిక పట్టాల్సిందే

ఆంధ్ర వైద్య కళాశాల అనుబంధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో బుధవారం జూనియర్ వైద్యులు సమ్మెకు దిగారు.

* ఓపీ విభాగాలలో వైద్య సేవలకు తిప్పలు
* శస్త్ర చికిత్సలపై పాక్షిక ప్రభావం
* జూనియర్ డాక్టర్ల  సమ్మె ప్రారంభం
విశాఖ మెడికల్: ఆంధ్ర వైద్య కళాశాల అనుబంధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో బుధవారం జూనియర్ వైద్యులు సమ్మెకు దిగారు. కింగ్ జార్జ్ ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద సమావేశమై ప్లకార్డులు ప్రదర్శించి మౌన నిరసన చేపట్టారు. పోస్టుగ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్ వైద్యులు, హౌస్ సర్జన్లు పెద్ద సంఖ్యలో తొలిరోజు ఓపీ, వార్డు వైద్య సేవలు బహిష్కరించారు.  అత్యవసర వైద్య సేవలకు హాజరయ్యారు. కేజీహెచ్‌తో పాటు ప్రభుత్వ విక్టోరియా ప్రసూతి ఆసుపత్రి, ప్రాంతీయ కంటి, ఈఎన్‌టీ, ఛాతి, అంటువ్యాధులు, ఆర్‌సీడీ, ప్రభుత్వ మానసిక ఆసుపత్రుల్లో  అవుట్ పేషెంట్, వార్డు వైద్య సేవలకు అంతరాయం కలిగింది.  

ఉదయం 8 గంటలకే కేజి హెచ్ ఓపికి చేరుకున్నా 10 గంటల వరకు తాళాలు తెరవకపోవడంతో రోగులు బారులు తీరారు. మెడిసిన్ ఓపీ విభాగానికి 11 గంటల వరకు వైద్యులు రాక రోగుల తాకిడి కనిపించింది. 11 గంటల తర్వాత వైద్యులు ఒంటి గంటలోపే  రోగులను నిమిషాల్లో చూసి పరీక్షలు రాసి పంపారు. రోగులు మూకుమ్మడిగా ఎక్స్‌రే, క్లినికల్ ల్యాబ్‌కు పోటెత్తారు.  వార్డుల్లో రోగులు సకాలంలో చికిత్స అందక అవస్థలు పడ్డారు. ఉదయం ఓపీలో రోగులను చూసిన సర్వీస్ పీజీలు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మధ్యాహ్నం వార్డులకు వచ్చారు.

కార్డియాలజీ, కి డ్నీ, ప్రసూతి, కాలిన గాయాలు, పిల్లల శస్త్ర చికిత్స, న్యూరోసర్జరీ, ఉదరకోస వైద్య విభాగాలు వంటి కీలక వార్డుల్లో రోగులు సకాలంలో చికిత్సలందక ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ విక్టోరియా(ఘోషా)ఆసుపత్రిలో గర్భిణులు  యాంటీనేటర్ల తనిఖీలు ఆలస్యంగా జరిగాయి.  నవజాత శిశు చికిత్స విభాగం(ఎస్‌ఎన్‌సీయూ)లో శిశువుల చికిత్సకు అంతరాయం ఏర్పడింది. ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో 28 మంది పీజీలు, ముగ్గురు సీనియర్ రెసిడెంట్లు, ఎనిమిది మంది హౌస్ సర్జన్లు సమ్మెలో పాల్గొనడంతో ఓపీ రోగులు అవస్థలు పడ్డారు.  ఇక్కడ ఐదుగురు సర్వీస్ పీజీలు మాత్రమే విధులు నిర్వహించారు.

గ్రామీణ ప్రాంతాల్లో కంటి శస్త్రచికిత్సలకు ఎంపిక చేసిన రోగులను సమ్మె కారణంగా  నిలిపేశారు.  ప్రభుత్వ ఛాతి ఆసుపత్రికి ఓపీ రోగుల తాకిడి ఎక్కువైంది. ఈఎన్‌టీ, ఆర్‌సీడీ, మానసిక ఆసుపత్రుల్లో కూడా రోగులు ఇబ్బందులు పడ్డారు. సమ్మె ప్రభావం అనుబంధ ఆసుపత్రుల్లోని తొలి రోజు శస్త్రచికిత్సలపై పాక్షిక ప్రభావం చూపింది.  జూనియర్ డాక్టర్ల సంఘం అద్యక్ష కార్యదర్శులు డాక్టర్ షాన్వాజ్, డాక్టర్ నాగచైతన్యలు మాట్లాడుతూ ప్రభుత్వం జూనియర్ వైద్యులచే వెట్టిచాకిరీ చేయించుకుంటుందని ఆరోపించారు. మెయిన్ గేటు వద్ద మౌన నిరసనలో ఆంధ్ర వైద్య కళాశాల జూనియర్ డాక్టర్ల సంఘం ఉపాధ్యక్షుడు ప్రసాద్, సమన్వయకర్త డాక్టర్ శోభన్, రాజేష్ అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement