- కేవలం 50 రోజులకు సరిపడా నిల్వ
- నిత్యం 10 టన్నులు అవసరం
- కొనుగోళ్లపై దృష్టిపెట్టని టీటీడీ
తిరుపతి సిటీ: టీటీడీలో నెయ్యి నిల్వలు నిండుకుంటున్నాయి. ప్రస్తుతం మార్కెటింగ్ విభాగం వద్ద టీటీడీ అవసరాలకు కేవలం 50 రోజులకు సరిపడా నెయ్యి మాత్రమే నిల్వ ఉంది. కొనుగోళ్లపై దృష్టి పెట్టాల్సిన అధికారులు కాలయాపన చేస్తున్నారు. గత ఏడాది ఇ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా 33 లక్షల కిలోల నెయ్యిని కిలో రూ.273.95 చొప్పున కొనుగోలు చేశారు. అప్పట్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలికి చెందిన ప్రీమియర్ అగ్రీఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ వారు టెండర్‌ను దక్కించుకున్నారు.
ఆగ్‌మార్క్ కలిగిన స్వచ్ఛమైన ఆవు నెయ్యిని సరఫరా చేయాలనే నిబంధన ఉంది. అయితే కొనుగోలుదారులు పోటీపడి మరీ తక్కువ ధరకు కోట్ చేయడంతో సరైన క్వాలిటీ ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నాలుగు మాసాల క్రితం ప్రసాదాల తయారీకి వినియోగించే సమయంలో చెడిపోయినట్లు గుర్తించిన 300 కిలోల నెయ్యిని సదరు కాంట్రాక్టర్‌కు వెనక్కి పంపించారు. ప్రస్తుతం టీటీడీ శ్రీవారి ఆలయంతోపాటు స్థానిక ఆలయాలకు ప్రసాదాల తయారీతోపాటు స్వామివారి కైంకర్యాలకు కలిపి నిత్యం 10 టన్నుల నెయ్యిని వినియోగిస్తున్నారు.
కాగా, ఇంతకుమునుపు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి టీటీడీ అధికారులు నెయ్యి కొనుగోలు చేసేవారు. దగ్గరలో అందుబాటులో ఉన్న వాటిని వదులుకుని దూర ప్రాంతం నుంచి కొనుగోలు చేయడంపై గతంలో టీటీడీ అధికారులపై విమర్శలు వచ్చాయి. ఇంకో యాభై రోజుల్లో నెయ్యి నిల్వలు అయిపోనున్నాయి. పైగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు వస్తుండడంతో వీలైనంత త్వరగా నెయ్యి కొనుగోలు చేయకపోతే ఇబ్బందులు తప్పవనే విషయాన్ని అధికారులు గుర్తించి కొనుగోళ్లకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఫైలు ఈవో గారికెళ్లింది
నెయ్యి కొనుగోలుకు సంబంధించిన ఇ-ప్రొక్యూర్‌మెంట్ ఫైలు ఈవోగారి దగ్గరకు వెళ్లింది. వీలైనంత త్వరలో కొనుగోలు ప్రక్రియను ప్రారంభిస్తాం. గతంలో రెండు సంస్థలు ఇ-ప్రొక్యూర్‌మెంట్‌లో పాల్గొన్నాయి.
-శ్రీనివాసరావు, మార్కెటింగ్ అధికారి, టీటీడీ