
ఒక్క నెల ఓపిక పట్టండి.... !
'వివిధ సమస్యలతో నా దగ్గరకు వస్తున్న ప్రజలకు నేనొక్కటే చెబుతున్నాను. ఒక్క నెల ఓపిక పట్టండి. మంచి రోజులు వస్తాయి. మీ సమస్యలన్నీ పరిష్కరించే ప్రజా ప్రభుత్వం వస్తుంది.' ఇదీ శోభా నాగిరెడ్డి చిట్టచివరగా సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్ వ్యూలో చెప్పిన మాటలు.
ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నప్పటికీ ఆమె సాక్షి టీవీ ప్రతినిధిని చూడగానే నవ్వుతూ పలకరించారు. అడగగానే ఇంటర్ వ్యూని ఇచ్చారు. ఇంటర్ వ్యూలో ఆమె వైఎస్ ఆర్ కాంగ్రెస్ విధానాల పట్ల, పార్టీ కార్యక్రమాల పట్ల ఎనలేని నమ్మకాన్ని తన మాటల్లో కనబరిచారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే చేసే ఆరు సంతకాలు రాష్ట్రం దశ, దిశను మార్చేస్తాయని ఆమె గట్టిగా నొక్కి చెప్పారు.
అన్నా సమస్య ఉందని ఎవరైనా భూమా నాగిరెడ్డి వద్దకు వస్తే ...'మీ అక్క ఉంది కదరా చెప్పు. ఆమె చూసుకుంటుంది' అనేవారు ఆయన. ఆళ్ళగడ్డకి ఆమె అక్క. ఆఖరి క్షణం దాకా ఆమె ప్రజల మధ్యే గడిపారు. పల్లెపల్లెను, గుండెగుండెనూ పలకరిస్తూ, చిరునవ్వుతో భరోసా ఇస్తూ ఆమె తరలిపోయారు.
'ఒక్క నెల ఆగండి. ఒక్క నెల ఓపిక పట్టండి' అని అందరికీ చెప్పిన శోభక్క ఒక్క రోజు ఆగకుండా వెళ్లిపోవడమే అసలైన విషాదం.