హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి టీవీ చానెల్ ప్రసారాలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిలుపుదల చేయడంపై జర్నలిస్టు సంఘాల ఫిర్యాదుపై రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సానుకూలంగా స్పందించారు. గత కొద్ది రోజులుగా ఏపీలో సాక్షి చానెల్ ప్రసారం కాకుండా ఎంఎస్‌వోలపై ఒత్తిడి తెచ్చి అడ్డుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వంపై హైదరాబాద్ లో బుధవారం జర్నలిస్టు సంఘాల నేతృత్వంలో పెద్దఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి వందలాదిగా జర్నలిస్టులు చంద్రబాబు ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ రాజ్ భవన్‌కు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయా సంఘాల ప్రతినిధులు గవర్నర్‌ను కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలపై ఫిర్యాదుచేశారు. ఆ మేరకు ఒక వినతిపత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
కాపు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌పై ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్ష కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నామన్న కారణంగా సాక్షి చానెల్‌పై చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఫిర్యాదుచేశారు. గత జూన్ 9వ తేదీ నుంచి సాక్షి ప్రసారాలను అడ్డుకుంటున్నారని, ఆ మేరకు రాష్ట్రంలోని ఎంఎస్‌వోలపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెచ్చి సాక్షి ప్రసారాలను నిలిపివేసిందని ప్రతినిధి బృందం గవర్నర్‌కు వివరించింది. సాక్షితో పాటు మరికొన్ని టీవీ చానెళ్ల ప్రసారాలను నిలిపివేయాలని ఆదేశాలిచ్చినట్టు స్వయంగా ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించిన విషయాన్ని వారు గవర్నర్‌కు వివరించారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, ఈ విషయంలో తక్షణం జోక్యం చేసుకుని తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రతినిధులు చెప్పిన వివరాలను శ్రద్ధగా విన్న గవర్నర్ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని సమావేశం అనంతరం సీనియర్ పాత్రికేయులు వివరించారు.
అంతకుముందు ప్రెస్ క్లబ్ నుంచి రాజభవన్ వరకు జర్నలిస్టులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ చర్యను ఖండిస్తూ కదం తొక్కారు. గవర్నర్ కలిసిన ప్రతినిధుల బృందంలో సీనియర్ పాత్రికేయులు జీఎస్ వరదాచారి, కె.శ్రీనివాసరెడ్డి, ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు అమర్ నాథ్, ఏపీయూడబ్ల్యూజే నాయకులు నరేందర్ రెడ్డి, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఆంజనేయులు, సీనియర్ పాత్రికేయులు నగేష్ కుమార్, సయ్యద్ హష్మీలతో పాటు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ఎడిటర్ వి.మురళి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్ దిలీప్ రెడ్డి, కొమ్మినేని శ్రీనివాసరావు, శైలేష్ రెడ్డి, భండారు శ్రీనివాసరావు, ప్రియా చౌదరి, గోపీనాథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రవికాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. వీరంతా గవర్నర్‌ను కలిసి జరుగుతున్న పరిణామాలను వివరించి వినతిపత్రం సమర్పించారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, తక్షణం సాక్షి చానెల్ ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.