
ఉత్తుత్తి మాటలే!
‘దొంగలు పడ్డ ఆర్నెళ్లకు మేల్కొన్నట్లు’ అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల వైఖరి ప్రస్ఫుటం అవుతోంది. ఈఏడు ఎగువన జోరుగా కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహించాయి. శ్రీశైలం రిజర్వాయర్‌లోకి వరద నీరు పుష్కలంగా వచ్చి చేరింది. నీరు తెచ్చుకునే అవకాశం ఉన్నప్పుడు మౌనంగా ఉండి, ఇప్పుడు జబ్బలు చరుచుకుంటూ గొప్పలు
చెప్పుకునే పనిలో పడ్డారు తెలుగుతమ్ముళ్లు.
సాక్షి ప్రతినిధి, కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో ఉన్నారు... జిఎన్‌ఎస్‌ఎస్, పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు... గండికోటలో నీరు నిల్వ చేసి తీరుతాం... పులివెందుల తర్వాతే కుప్పంకు నీరు ఇస్తామని చంద్రబాబు చెప్పారంటూ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి గొప్పగా ప్రకటించారు. అయితే అవన్నీ సత్యదూరాలని, ఉత్తుత్తి మాటలే అని వాస్తవ పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. ఈ ప్రాంతవాసిగా ముఖ్యమంత్రి రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని సాగునీటి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాయలసీమకు సాగు, తాగునీరు అందించాలంటే శ్రీశైలం రిజర్వాయరే మూలం.
అలాంటిది కనీస నీటి మట్టం నిల్వ చేయకుండా ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి రాయలసీమ కడుపుకోతకు కారకుడయ్యారని పలువురు వాపోతున్నారు. ఆపై నెపం తెలంగాణ రాష్ట్రంపై వేసి కన్నతల్లిలాంటి రాయసీమను సైతం వంచించారని పలువురు ఆవేదన చెందుతున్నారు. అధికారిక పగ్గాలు చేపట్టాక ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి మెట్టప్రాంతమైన రాయలసీమలో నీరు నిల్వచేసుకోవాల్సిన సమయంలో ఇక్కడి టీడీపీ నేతలు మిన్నకుండిపోయారు. అప్పట్లో మంత్రుల పర్యటనలు పరపతి పెంచుకునేందుకే మినహా, ఒక్కమారైనా ప్రాంతం కోసం ప్రాజెక్టుల కోసం చర్చించిన పాపాన పోలేదని పరిశీలకులు భావిస్తున్నారు.
పరవళ్లు తొక్కిన కృష్ణ, తుంగభద్ర నదులు
ఈ ఏడాది కృష్ణ, తుంగభద్ర నదులు వరదతో పరవళ్లు తొక్కాయి. వాటి ద్వారా 2014 జూలై 30 నుంచే శ్రీశైలం ప్రాజెక్టులోకి వరదనీరు చేరిక మొదలయింది. 2015 జనవరి 12వరకూ వరదనీరు ప్రాజెక్టులోకి వచ్చినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈమారు కృష్ణా జలాలు 182 టిఎంసీలు శ్రీశైలంలోకి వచ్చాయి. తుంగభద్ర నుంచి 302 టీఎంసీలు వచ్చిచేరాయి. అంటే 484 టీఎంసీల నీరు శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద రూపంలో వచ్చి చేరింది. ఆ సమయంలో స్పందించాల్సిన అధికార పార్టీ నేతలెవ్వరూ మాట్లాడిన దాఖలాలు లేవు.
484 టీఎంసీల్లో కేవలం 82 టీఎంసీలు మాత్రమే ఎస్సార్బీసీ, తెలుగుగంగ, చెన్నై తాగునీటి అవసరాలతో పాటు రాయలసీమకు వాడుకున్నట్లు అధికారికవర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఈమారు తెలంగాణ రాష్ట్రానికి 176 టీఎంసీల నీరు దక్కింది. తక్కిన 226 టీఎంసీల నీరు ఆంధ్ర ప్రాంతానికి దక్కింది. రాయలసీమ ప్రాంతవాసి ముఖ్యమంత్రిగా ఉండి కూడా సాగు, తాగునీరు అందించడంలో తీవ్ర అన్యాయం చేశారని ప్రజలు వాపోతున్నారు.
రాయలసీమకు తీవ్ర అన్యాయం....
ఈ మారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పగ్గాలు చేపట్టాక తొలి సంవత్సరమే రాయలసీమకు వ్యూహాత్మకంగా అన్యాయం చేశారని సాగునీటి రంగ నిపుణుల వాదన. శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం 861 అడుగులు వచ్చేంత వరకూ విద్యుత్ ఉత్పాదనకు ఇష్టా రాజ్యంగా చేశారు. నాగార్జునసాగర్ నిండిన తర్వాతే పవర్ జనరేషన్ ఆపాలంటూ హుదూద్ తుపాన్ పర్యవేక్షణ చేస్తూ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. రెండు రాష్ట్రాలు పోటీపడి విద్యుత్ ఉత్పాదన చేయడంతో చాలా స్పీడుగా జలాశయంలో నీరు అడగంటింది.
రాయలసీమ ముంగిట్లో నీరున్నా తెచ్చుకోలేని దుస్థితి కల్పించారు. జిల్లాలో సుమారు 30 టీఎంసీల నీటిని బ్రహ్మంసాగర్, గండికోట, మైలవరం జలాశయాల్లో నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యల్లేవు. ఆ దిశగా అధికార పార్టీ నేతల చర్యలే లేకపోయాయి. రాయలసీమ అవసరాల రీత్యా 854 అడుగుల కనీస నీటిమట్టం నిల్వ చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులను సైతం ధిక్కరించారు. ఈరోజుకు కేవలం 834 అడుగులే శ్రీశైలంలో నీటిమట్టం ఉంది. 854 అడుగుల నీటిమట్టం మెయింటెన్ చేస్తేనే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీరు తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది.
అంతా అయ్యాక సాఫీగా గండికోటకు నీరు ఇచ్చి తీరుతామంటూ అధికార పార్టీ నేతలు జబ్బలు చరుస్తున్నారు. ముఖ్యమంత్రి కాలువలను సందర్శిస్తాడని అక్కడే నిద్ర చేస్తాడని ప్రకటిస్తున్నారు. సీఎం పర్యటనకు ఖర్చు మినహా రాయలసీమకు ఒనగూరే ప్రయోజనం లేదని పలువురు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గండికోటకు నీరు ఇప్పట్లో అసాధ్యమని వాస్తవ పరిస్థితులు చెబుతున్నాయి. ఇకనైనా అధికార పార్టీ నేతలు స్పందించాల్సిన సమయంలో చొరవ చూపించాలని, న్యాయమైన హక్కుల కోసం పోరాడాల్సిన ఆవశ్యత ఉంది.