
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అప్పారావు ప్రమాణం
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ వేగి సూరి అప్పారావు గురువారం ప్రమాణం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా ఆయనతో ప్రమాణం చేయించారు.
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ వేగి సూరి అప్పారావు గురువారం ప్రమాణం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా ఆయనతో ప్రమాణం చేయించారు. హైకోర్టులో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, రిజిస్ట్రార్‌లు, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ పొన్నం అశోక్‌గౌడ్, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గిరిధర్‌రావు, ప్రభుత్వ న్యాయవాదులు, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.
అనంతరం జస్టిస్ సూరి అప్పారావు కోర్టులో కేసులను విచారించారు. హైకోర్టులో అనుమతించిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 49 కాగా, జస్టిస్ సూరి అప్పారావు రాకతో ప్రస్తుత న్యాయమూర్తుల సంఖ్య 36కు చేరింది. జస్టిస్ అప్పారావు... 2010 నవంబర్ 15న రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011 ఏప్రిల్ 21న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. దాదాపు 18 నెలల తర్వాత ఆయన తిరిగి రాష్ట్ర హైకోర్టుకు బదిలీపై వచ్చారు.