
'పవన్.. భూసేకరణ చట్టంపై మీ వైఖరేంటి?'
భూసేకరణ సవరణ చట్టంపై సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వైఖరి స్పష్టం చేయాలని జనచైతన్య వేదిక కన్వీనర్ జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి డిమాండ్ చేశారు.
గుంటూరు: భూసేకరణ సవరణ చట్టంపై సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వైఖరి స్పష్టం చేయాలని జనచైతన్య వేదిక కన్వీనర్ జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో ఏడాదికి నాలుగు పంటలు పండే భూములను ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరుతో ధ్వంసం చేయడంపై పవన్ స్పందించాలని పేర్కొన్నారు. ఆ తర్వాతనే పవన్ రాజధాని ప్రాంతంలో పర్యటించాలని అన్నారు. రాజధాని ప్రాంత గ్రామాల్లో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. పవన్ ఆ ప్రాంతంలో పర్యటించనున్న నేపథ్యంలో జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి స్పందించారు.
రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే భూసేకరణ చట్టాన్ని టీడీపీ మినహా అన్ని పార్టీలు ఖండిస్తున్నాయని జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం, బిల్డర్ మాఫియాను ప్రోత్సహించడంపై పవన్ స్పందించాలని జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి డిమాండ్ చేశారు.