ఓటుకు నోటు వ్యవహారాన్ని, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యగా చిత్రించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అన్నారు.
తూర్పుగోదావరి (గోకవరం): ఓటుకు నోటు వ్యవహారాన్ని, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యగా చిత్రించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం రంపయర్రంపాలెంలో కల్తీ కల్లు మృతుల కుటుంబాలను ఆయన సోమవారం పరామర్శించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు రూ.90 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధపడి, రాష్ట్రంలో బీద అరుపులు అరుస్తున్నారని ఎద్దేవా చేశారు.
కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలను బేరమాడడాన్ని ప్రజలందరూ ప్రత్యక్షంగా గమనించారనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. తాను చేసిందే నీతి అని పదేపదే చెప్పే చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇలాంటి కుటిల రాజకీయాలకు తెలుగు ప్రజలను బలి చేయవద్దని జ్యోతుల ఈ సందర్భంగా చంద్రబాబును కోరారు. రేవంత్‌రెడ్డి ఉదంతం తెలంగాణలో జరిగింది కాబట్టి టీడీపీ అధినేతగా చంద్రబాబు దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అంతే కానీ.. రేవంత్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని రెచ్చగొట్టడం తగదని అన్నారు.