తవ్వేకొద్ది బయటపడుతున్న నిజాలు! | Kadapa murders mystery | Sakshi
Sakshi News home page

తవ్వేకొద్ది బయటపడుతున్న నిజాలు!

Published Thu, Oct 9 2014 4:33 PM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM

కృపాకర్, భార్య మౌనిక, ముగ్గురు పిల్లలు - ఇన్సెట్లో రాజారత్నం ఐజాక్

కృపాకర్, భార్య మౌనిక, ముగ్గురు పిల్లలు - ఇన్సెట్లో రాజారత్నం ఐజాక్

పది మందిలో పేరు - ప్రతిష్ట - హోదా అన్నీ ఉన్నాయి.  ఆ పేరుకు మచ్చ రానుంది అనుకున్నాడు. అంతే, ఇంకేమి ఆలోచించలేదు. గుడ్డిగా ముందుకెళ్లాడు. ఒకరి హత్యతో మొదలైన కథ, మరో నలుగురి ప్రాణాలు తీసేలా చేసింది.  కడపలో జరిగిన అయిదు హత్యలు సస్పెన్స్‌, క్రైం, యాక్షన్‌, థ్రిల్లర్‌ను తలపించేలా ఉన్నాయి. ఈ కేసులో తవ్వేకొద్ది నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.  వివాహేతర సంబంధం అనుమానాలు ఓ పచ్చని కాపురంలో చిచ్చుపెట్టాయి. కోడలి తీరుపై మామకు అనుమానం. ముందు కోడలి హత్య.  ఆ తరువాత ఇద్దరు మనవరాళ్లు, ఓ మనవడు. చివరకు కొడుకు కూడా హత్యకు గురయ్యాడు. ఈ హత్యలకు సంబంధించి భిన్న కథనాలు వినవస్తున్నాయి. పోలీసులు కూడా ఒక నిర్ధారణకు రాలేకపోతున్నారు.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం రాజారత్నం ఐజాక్ కడపలో  ఓ పేరున్న పెద్దమనిషి. రాష్ట్రపతి నుంచి కబీర్ పురస్కార్ అవార్డు అందుకున్నారు. జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ చైర్మన్. జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడుగా, ఏపీ ఖోఖో రాష్ట్ర అసోసియేషన్ శాశ్వత చైర్మన్‌గా సైతం కొనసాగుతూనే  ఉన్నారు. అటువంటి వ్యక్తి  ఇంటి ఆవరణలో ఐదుగురి మృతదేహాల్ని పాతిపెట్టారు. ఆ మృతదేహాలు అతని కొడుకు, కోడలు, మనవడు, మనవరాళ్లవి.  ఈ హత్యలకు, ఆయనకు సంబంధం ఉందని  పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యలు జరిగి ఏడాదిన్నర అవుతోంది. ఆయన మాత్రం అలాగే  పెద్దమనిషిగా చలామణీ అవుతున్నారు.

పోలీసుల కథనం ప్రకారం కృపాకర్ ఐజాక్ 2004లో మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ వివాహం రాజారత్నంకు ఇష్టంలేదు. కోడలికి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానాలు రేకెత్తించాడు. దాంతో కాపురంలో కలతలు చెలరేగాయి.  కుటుంబం పరువు పోతుందని రాజారత్నం  భావించాడు. మౌనికను అడ్డు తొలగించుకుంటే తప్ప, పరువు నిలవదనుకున్నాడు. డ్రైవర్‌ రామాంజనేయులికి రెండు లక్షల రూపాయలు ఇచ్చి కోడలు మౌనికను ఖతం చేయాలని ఆదేశించాడు. మృతదేహాన్ని బయటకు తీసుకెళ్తే  విషయం బయటకు పొక్కుతుందని భయపడ్డాడు. మౌనిక శవాన్ని సొంత జియాన్ స్కూల్‌లోనే పూడ్పించే ఏర్పాటు చేశాడు.

తల్లి హత్యను వారి ముగ్గురు పిల్లలు కళ్లారా చూశారు.  తల్లి హత్య గుట్టును పిల్లలు రట్టు చేస్తారని రాజారత్నం అనుమానించాడు.  పిల్లలను కూడా తల్లి దగ్గరకు పంపితే, తన పేరు మీద వున్న స్కూల్‌ రాసిస్తానని డ్రైవర్‌ రామాంజనేయులుకి ఆఫర్‌ ఇచ్చాడు. ఇంకేముంది ఆ డ్రైవర్ ఆశపడ్డాడు. అప్పటికే ఒక హత్య చేసి ఉన్నాడు.  పిల్లలను కూడా చంపేశాడు.  తల్లిని పూడ్చిన ప్రాంతంలోనే ఖననం చేశాడు. రాజారత్నం కొడుకు కృపాకర్ రూపంలో  కథ అడ్డంతిరుగుతుందని రామాంజనేయులు అనుకోలేదు.  స్కూల్‌ విషయంలో కొడుకు కృపాకర్‌ - డ్రైవర్‌ రామాంజనేయులు మధ్య గొడవలు మొదలయ్యాయి.  ఎప్పటికైనా హత్యల మిస్టరీ బయటపడుతుందని  రామాంజనేయులు భావించాడు.  ఇంకేముంది కృపాకర్‌ను కూడా  హత్య చేశాడు. అతని  భార్య, పిల్లలను పూడ్చిన ప్రాంతంలోనే అతని మృతదేహాన్ని కూడా పూడ్చేశాడు.

పరువు గురించి ఆలోచిస్తే, రాజారత్నంకు కన్న కొడుకు కూడా కాకుండా పోయాడు. దాంతో రాజారత్నం ఆవేదన చెందాడు. కొడుకును చంపిన డ్రైవర్‌ రామాంజనేయులును హత్య చేయించాలనుకున్నాడు. అందుకు కిరాయి హంతకులకు 15 లక్షల రూపాయలు ఆఫర్‌ ఇచ్చాడు. ఈ విషయం  రామాంజనేయులుకు తెలిసింది. ఇక చేసేదేమీలేక, రామాంజనేయులు జరిగిన కథను పూస గుచ్చినట్లు పోలీసులకు వివరించాడు.  పోలీసులు జియోన్ పాఠశాల ఆవరణలో తవ్వించి అయిదుగురి అస్థిపంజరాలను వెలికితీశారు. దాంతో ఈ మిస్టరీ కొంతవరకు వీడింది. ఒక తప్పును కప్పిపుచ్చేందుకు మరో తప్పు, ఇలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూపోతే ఐదుగురి ప్రాణాలు పోయాయి. ఈ హత్యలపై ఇంకా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  జియోన్ పాఠశాలకు సంబంధించిన పత్రాలను కూడా స్కూల్ ఆవరణలోనే పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఆ డాక్యుమెంట్లను వెలికితీయించారు.

ఈ కేసులో కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న రాజారత్నం  చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.  పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. రాజారత్నం ఐజాక్ను సంఘటనా స్థలం వద్దే పోలీసులు విచారించి అసలు నిజాలు రాబట్టే అవకాశం ఉంది. ఈ విచారణలో వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
**

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement