
విశాఖ జోన్‌తో కడప వాసులకు తిప్పలు
కడపకు రైల్వే పచ్చజెండా ఊపాలి..
సాక్షి, విజయవాడ బ్యూరో : విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వేజోన్ ఏర్పాటు చేస్తే గుంతకల్లు డివిజన్ పరిధిలోని కడప వాసులు జోనల్ కార్యాలయానికి వెళ్లాలంటే వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చెప్పారు. గుంతకల్లు డివిజన్‌ను యథాతథంగా సికింద్రాబాద్‌లోని దక్షిణమధ్య రైల్వేలోనే కొనసాగించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవను కోరారు.
గుంటూరు, విజయవాడ కేంద్రంంగా కొత్త జోన్ ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి మధ్యలో ఉంటుందని అన్నారు. కడప జిల్లాలో రైల్వే సేవలను మెరుగుపరిచేలా అవినాష్‌రెడ్డి పలు ప్రతిపాదనలు అందజేశారు. మంగళవారం విజయవాడలో జరిగిన ఎంపీల సమావేశంలో అవినాష్‌రెడ్డి ఈ ప్రతిపాదనలు చేశారు.
నవజీవన్ ఎక్స్‌ప్రెస్ పునరుద్దరించాలి. తిరుపతి నుంచి షిర్డీకి ప్రతి రోజు ఎక్స్‌ప్రెస్, బనగానపల్లి నుంచి వేలూరు వరకు పాసింజర్ రైలు, బనగానపల్లి నుంచి అరక్కోణం వరకు పాసింజర్ రైలు వేయాలని కోరారు.
తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ను కడప వరకు పొడిగించాలి. విజయవాడ మీదుగా తిరుపతి వచ్చే మచిలీపట్నం, తిరుమల ఎక్స్‌ప్రెస్‌లను కడప వరకు పొడిగించాలి. ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, బాలాజీ ఎక్స్‌ప్రెస్‌లను ప్రతిరోజు నడపాలి.
యర్రగుంట్ల-నంద్యాల, కడప-బెంగళూరు రైల్వే మార్గాలను త్వరగా పూర్తి చేయాలి.
కడపలో అన్ని రైళ్ళకు ఐదు నిముషాలు హాల్ట్ ఇవ్వాలి. కడపలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలి. కడప స్టేషన్‌లో ఎస్కలేటర్ నిర్మించాలి. కడప లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కొత్తగా నిర్మించే రైల్వే స్టేషన్‌లను రోడ్డు మార్గానికి ఆనుకుని నిర్మించాలి.. కొండాపురం, ముద్దనూరు, కమలాపురం రైల్వేస్టేషన్‌లలో డబుల్‌డెక్కర్ రైల్‌కు హాల్ట్ ఇవ్వాలి.
కాచిగూడ-చెన్నై, లోకమాన్య తిలక్(బాలాజీ)-మదురై, జయంతి ఎక్స్‌ప్రెస్‌లను కమలాపురం, ముద్దనూరు, కొండాపురం రైల్వేస్టేషన్‌లలో హాల్ట్ ఇవ్వాలి.. కడప లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో రైల్వేలైనుకు అవసరమైన చోట్ల అండర్‌పాసింగ్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలి.
మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు డ్రీమ్డ్ ప్రాజెక్టు అయిన యర్రగుంట్ల-నంద్యాల రైల్వేలైను నిర్మాణం 30 ఏళ్లగా సాగుతోంది. దాన్ని త్వరితగతిన పూర్తిచేస్తే రాష్ట్ర రాజధాని విజయవాడకు చేరుకునేందుకు ఉపయోగపడుతుంది. 1987లో చేపట్టిన ఈ ప్రాజెక్టు 93కిలోమీటర్లు పూరైంది. మరో 30కిలోమీటర్లు పూర్తి చేయాల్సి ఉంది.. జిల్లా కేంద్రమైన కడప నుంచి నంద్యాల మీదుగా గుంటూరు, తెనాలి, విజయవాడ, విశాఖపట్నం వెళ్లేందుకు యర్రగుంట్ల-నంద్యాల లైను కీలకంగా అవుతుంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృషితో సాధించిన కడప-బెంగళూరు రైలు మార్గం నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేయాలి. ఏపీలో 257కిలోమీటర్లు, కర్నాటకలో 22కిలోమీటర్లు మేర రైల్వేలైను నిర్మించేలా మంజూరు చేశారు. ఈ కీలక ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం నిధులు కేటాయించాల్సి ఉంది. వైఎస్ హయాంలో నిధులు విడుదల చేయడంతో 25కిలోమీటర్ల వరకు ట్రాక్ ఏర్పాటు పూర్తి అయింది. తరువాత వచ్చిన పాలకులు నిధులు ఇవ్వకపోవడంతో రైల్వేలైనుకు అవసరమైన భూ సేకరణ కూడా నిలిచిపోయింది.. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదల చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి.