
రోడ్డుపై ఓ ఆటో డ్రైవర్‌ను బెదిరిస్తున్న సీఐ మల్లికార్జున గుప్త
ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. ఇతరుల వల్ల అన్యాయం జరిగినా.. వెంటనే పరిగెత్తేది పోలీసుస్టేషన్‌కు. బాధితుల ఫిర్యాదు తీసుకుని విచారణ జరిపి నిందితులను కోర్టు మెట్లెక్కించడం పోలీసుల విధి. అలాంటి ఓ పోలీసు దారి తప్పాడు. ఓ సర్కిల్‌కు ఉన్నతాధికారిగా.. తన సిబ్బందికి ఆదర్శంగా ఉండాల్సిన ఆయన.. ఖాకీ ముసుగులో కాసుల వేటలో పడ్డాడు. కేసు ఏదైనా.. బాధితులైనా.. నిందితులైనా డబ్బులిస్తేనే వారికి న్యాయం చేస్తాడనే పేరు ఈయన సొంతం. అడిగినంత ఇవ్వకపోతే బాధితులపైనే రివర్స్ కేసు పెట్టేస్తాడనే అపవాదూ ఉంది. అందుకే కదిరిలో ఆయన పేరు ‘మనీ’కార్జునగా మార్మోగుతోంది.
సాక్షి, కదిరి(అనంతపురం): పోలీసు శాఖలో సీఐ అంటే అందరికీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గానే తెలుసు. కానీ కదిరి టౌన్ సీఐ మల్లికార్జున గుప్త మాత్రం ఆ పదాన్ని కలెక్షన్ ఇన్‌స్పెక్టర్‌గా మార్చేశారు. నిందితులతో పాటు బాధితుల దగ్గర కూడా పైసలు వసూలు చేస్తున్నాడు. ఎస్పీ సత్యయేసుబాబు ఫ్రెండ్లీ పోలిసింగ్‌కు కృషి చేస్తుండగా.. కదిరి టౌన్ సీఐ మాత్రం కాసులిస్తేనే ఖాకీ సేవలనేలా వ్యవహరిస్తున్నాడు. బాధితులైనా సరే పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెపితే కానీ న్యాయం చేసే పరిస్థితి లేదు. అందువల్లే ఆయన కదిరికి వచ్చిన 90 రోజుల్లోనే రూ.కోటి దాకా అక్రమంగా సంపాదించాడని పోలీసుల వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.
బూటు కాలుతో తంతా...
‘నా అల్లుడు శ్రీనివాసులు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం మీద నెల రోజుల క్రితం మీకు ఫిర్యాదు చేశాం. మీరు ఏ మాత్రం పట్టించుకోలేదు. సీఐకి రూ.50 వేలు ఇచ్చాను. ఆయన నా మాటే మాట్లాడతాడని మా అల్లుడే మాతోనే ఎన్నోసార్లు అన్నాడు. నా కూతురు శైలజకు జరిగిన అన్యాయం నీ కూతురుకు జరిగితే మీరు ఇలాగే వ్యవహరిస్తారా..?’ అని కదిరి పట్టణానికి చెందిన సుజాత అన్నందుకు ‘చెప్పుతో కొడతా లం.., నోటి కొచ్చింది మాట్లాడతావా?’ అంటూ పత్రికలో రాయలేని విధంగా దూషించారు. తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె.. గత శనివారం సాయంత్రం స్టేషన్ ప్రాంగణంలోనే విషద్రావకం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తెలిసిందే. ఈ దృశ్యాన్ని ఆమె బంధువులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా.. వారిని చితక్కొట్టిన సీఐ మల్లికార్జున గుప్త.. తమ విధులకు ఆటంకం కల్గించారంటూ బాధితులపైనే కేసు నమోదు చేయడం గమనార్హం.
ఆయనకు 41 నోటీసు వజ్రాయుధం
పలు నేరాల్లో నిందితుడైన హతీక్ అనే వ్యక్తి ఓ మహిళను చీరపట్టి లాగి అందరి ముందూ అవమానించాడు. దీనిపై బాధిత మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే.. సీఐ మల్లికార్జున గుప్త నిందితుడి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని అతనికి 41 నోటీసు ఇచ్చి సరిపెట్టారు. అలాగే రెండు రోజుల క్రితం తన అల్లుడు రెండోపెళ్లి చేసుకున్నాడని సూజత అనే మహిళ ఫిర్యాదు చేయగా.. నిందితుడు శ్రీనివాసులు దగ్గర రూ.50 వేలు లంచం తీసుకొని అతనికి కూడా 41 నోటీసు ఇచ్చి చేతులకు దులుపుకున్నాడని బాధితురాలు మీడియా ముందు వాపోయింది.
కేసు వస్తే సీఐకి కాసుల పంటే
టీడీపీ పట్టణాధ్యక్షుడు అహ్మద్‌వలీ ఇంటి పట్టాల ఇప్పిస్తామని చెప్పి తమవద్ద భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించారని దాదాపు 150 మంది భవన నిర్మాణ కార్మికులు ఫిర్యాదు చేస్తే.. ఆ కేసులో కూడా అహ్మద్ వలి దగ్గర సుమారు రూ.5 లక్షలు దాకా డబ్బు తీసుకొని 41 నోటీసుతో సరిపెట్టాడని బాధితులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు అడిగితే కేసు నమోదు చేసి నిందితుడికి 41 నోటీసు ఇచ్చామని తప్పించుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు.
⇔ రైల్వేస్టేషన్ రోడ్‌లో ఇటీవల వడ్డే సామాజిక వర్గానికి చెందిన ఇరు వర్గాలు ఇంటి విషయంలో తగాదా పడితే పోలీస్ స్టేషన్‌లోనే దుప్పటి పంచాయతీ చేసి అక్కడే పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్ ద్వారా రూ.50 వేలు లంచం తీసుకున్నట్లు పోలీసు వర్గాల్లోనే చర్చ నడుస్తోంది.
⇔ టీడీపీ ఇన్‌చార్జ్ కందికుంట అనుచరుడు పాలహరి అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ పొలాన్ని కబ్జాచేసి తప్పుడు పత్రాలు పుట్టించారని రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్స్ అధికారి ఒకరు ఈ మధ్యే కదిరి తహసీల్దార్ మారుతిని కలిసి ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన తహసీల్దార్.. బాధితులకు న్యాయం చేస్తూ ఆ పొలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేటప్పుడు పోలీసులు అతనికి రక్షణ కల్పించాలని ఆదేశించారు. ఈ కేసులో కూడా పట్టణ సీఐ పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితులకు ఎలాంటి పోలీసు రక్షణ కల్పించకపోగా... నిందితునికి బదులు బాధితుడినే స్టేషన్‌కు పిలిపించి అతన్ని బెదిరించే ధోరణిలో మాట్లాడినట్లు తెలుస్తోంది.
⇔ ఇక వైఎస్సార్ జిల్లా నుంచి బదిలీపై సీఐగా ఇక్కడికి వచ్చిన మల్లికార్జున అక్కడ ఉన్న తన ఇంటి సామగ్రిని ఓ మినీ లారీలో కదిరికి తెప్పించుకున్నాడు. కదిరికి చెందిన ఆ లారీ యజమాని రహంతుల్లాకు బాడుగ ఇవ్వకుండా.. ఆయన కోరిక మేరకు అతనికి సరిపోని ఇరువురిపై తప్పుడు కేసు నమోదు చేశారు. మొదట రాయించిన కంప్లైంట్ సరిగా లేదంటూ దాన్ని చింపేసి, తమను చంపడానికి వచ్చారంటూ మరో ఫిర్యాదు రాయించుకొని తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్లు పట్టణ ఎస్‌ఐ మహమ్మద్ రఫీ చేత బలవంతంగా ఆ కేసు ఫైల్ చేయించినట్లు చర్చ జరుగుతోంది.
పైసలిస్తే కేసు క్లోజ్
టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ ముఖ్య అనుచరుడు నటేష్ ఎంతో మంది రైతులను మోసగించి సుమారు రూ.2 కోట్లకు పైగా ఎగ్గొట్టాడు. దీనిపై బాధిత రైతులు పోలీసులను ఆశ్రయించారు. గతంలో ఇక్కడ పని చేసిన సీఐ బీవీ చలపతికి నటేష్ రూ.20 లక్షలు ఆఫర్ చేసి ఆ కేసు మూసివేయాలని కోరితే అందుకు ఆయన నిరాకరించారు. అయితే ప్రస్తుత సీఐ మల్లికార్జున గుప్త ఇంకా ఎక్కువ మొత్తం తీసుకొని బాధితుడు నాయక్ ఒక్కరే అని చూపుతూ లోక్ అదాలత్ ద్వారా ఆ కేసును కొట్టివేయించి మిగిలిన రైతులందరినీ మోసగించారని బాధితులు వాపోతున్నారు.
అక్కడ కూడా ఇంతే..
సీఐ మల్లికార్జున గుప్త టీడీపీ హయాంలో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో పని చేసేటప్పుడు కూడా టీడీపీ నాయకుల మెప్పుకోసం అక్కడి ఎమ్మెల్యే రోజాపై పలు తప్పుడు కేసులు బనాయించారు. ఇలా ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ పేరు డీఎస్పీ పదోన్నతి జాబితాలో ఉందని తెలిసి పోలీసులే ముక్కున వేలేసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి తక్షణం ఇతన్ని విధుల నుంచి తప్పించి నిష్పక్షపాతంగా ఉన్న ఓ పోలీసు అధికారితో దర్యాప్తు జరిపిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment