
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగాన్ని ప్రతిపక్ష నేతలు తప్పుపట్టటం సరికాదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సోమవారం చర్చ మొదలైంది. కాకాని గోవర్థన్ రెడ్డి గవర్నర్ ప్రసంగాన్ని బలపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2014నుంచి ఇప్పటి వరకు హోదా కోసం కట్టుబడి ఉన్నారన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా ముందుకు వెళ్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో అధికారాన్ని, నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనేక సార్లు యూ టర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని తెలిపారు. గత ప్రభుత్వంలో నాయకులు తమ స్వార్థం కోసం ఏపీ ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పోలవరం అంచనాలను పెంచిందన్నారు. జన్మభూమి కమిటీలతో టీడీపీ నేతలు అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు. గత ఐదేళ్లలో ప్రజలు దౌర్భాగ్యమైన పాలనను చూశారన్నారు.
మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని.. ప్రభుత్వ విప్ ముత్యాల నాయుడు పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కేబినేట్‌లో స్థానం కల్పించామని తెలిపారు. ప్రజలు పూర్తిగా విశ్వాసం, నమ్మకంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించారని అన్నారు. రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment