ఓట్లు మాయం
♦ ‘సాక్షి’ ముందే చెప్పింది
♦ ఒక్కో డివిజన్‌లో ఐదు నుంచి పదిశాతం గల్లంతు
♦ పట్టించుకోని యంత్రాంగం పోలింగ్‌శాతంపై ప్రభావం
♦ 64.78 శాతం మాత్రమే నమోదు
♦ ఆందోళనలో అభ్యర్థులు
కాకినాడ : భార్యకు ఓటు ఉంటే.. భర్తకు లేదు. కుమారుడికి ఓటు ఉంటే తల్లికి లేదు. ఎన్నో ఎన్నికల్లో ఓటు వేసిన వయోవృద్ధులు ఈసారి ఓటుహక్కును వినియోగించులేకపోయారు. ఒకటి కాదు రెండు కాదు.. ఒక్కో డివిజన్ పరిధిలో ఐదు నుంచి పదిశాతం ఓట్లు గల్లంతయ్యాయి. ఈ విషయమై ‘సాక్షి’ ముందే హెచ్చరించింది. నగర పౌరులు పూర్తిస్థాయిలో ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఫలితంగా ఎంతోమంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోకుండానే నిరాశతో వెనుతిరిగాల్సి వచ్చింది.
కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటరు జాబితాలు గందరగోళంగా తయారయ్యాయి. ఒక ఇంటిలో నలుగురు ఓటర్లుంటే ఇరువురికి మాత్రమే ప్రస్తుత జాబితాలో ఓటు ఉండడం, మిగిలిన వారి పేర్లు లేకపోవడం, జాబితాలో పేరున్నా డోరు నంబర్లు మారిపోవడం తదితర కారణాలతో వందలాది మంది ఓటర్లు ఓటు హక్కును కోల్పోవాల్సి వచ్చింది. ఒక్కో డివిజన్‌లో ఐదు నుంచి పదిశాతం వరకు ఓట్లు ఈ విధంగా గల్లంతయ్యాయి. ఈ విషయమై ఈనెల 28న ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. సమస్యను పరిష్కరించే దిశగా అధికార యంత్రంగా చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది.
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు జాబితాలో సరిచూసుకునే వెసులుబాటు కల్పించలేదు. అభ్యర్థులు ఏర్పాటు చేసుకున్న శిబిరాలే దిక్కయ్యాయి. జాబితాల్లో తప్పులపై సమాధానం చెప్పే నాథులు కరువయ్యారు. దీంతో చేతిలో ఓటరు కార్డు ఉన్నా ఓటు వేసే వీలులేకపోవడంతో నగర పౌరులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. మూడు పర్యాయాలుగా ఓటుహక్కును వినియోగించుకుంటున్నానని, డోర్ నంబరు మార్పు చేయడంతో ఈ ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్నానని రెండో డివిజన్‌కు చెందిన ఎస్.నిరంజన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యకు మాత్రమే ఓటు ఉందని, తనకు మాత్రం రాలేదని ఐదో డివిజన్‌కు చెందిన వి. శ్రీనివాసరావు వాపోగా, 20 ఏళ్లుగా ఉన్న ఇంటి డోర్ నంబరు ఇప్పుడు మార్చేశారని ఓటే వేసే వీలులేకపోయిందని 26వ డివిజన్‌కు చెందిన దుర్గ తెలిపింది. పోలింగ్ స్టేషన్ల వద్ద సవరణ జాబితాలు ఏర్పాటుచేయలేదని పలువురు ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. డివిజన్ల పరిధిలోని ప్రాంతాలను మార్పు చేసినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, జాబితాలు సరిచేసినప్పుడు సాంకేతిక లోపాలు ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లడానికి కారణమై ఉండవచ్చునంటున్నారు. నగరంలో దాదాపు 20 వేలకు పైబడి ఓట్లు గల్లంతై ఉండవచ్చునని భావిస్తున్నారు.
పోలింగ్‌పై ప్రభావం.. ఆందోళనలో అభ్యర్థులు
స్థానిక ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకం కావడంతో ఓట్లు గల్లంతవ్వడం అభ్యర్థులను బెంబేలెత్తిస్తోంది. 48 డివిజన్ల పరిధిలో మొత్తం ఓటర్లు 2,29,373 మంది ఉన్నారు. పోలింగ్ ప్రారంభం నుంచి అభ్యర్థులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పోలింగ్ ముగిసే సమయం దగ్గరపడే కొద్ది ఇంకా ఎవరెవరు మిగిలి ఉన్నారో ఏజెంట్లు ద్వారా సమాచారం తెప్పించుకుని వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి ఓట్లు వేయించి పంపేందుకు ప్రాధాన్యమిచ్చారు.
ఆయా కారణాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతానికి పైబడి పోలింగ్ జరుగుతుంది. కాగా కేవలం 64.78 శాతం మాత్రమే ఓట్లు పోలవ్వడం గమనార్హం. 1,48,598 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. తమను బలపరుస్తారని భావించిన పలువురి ఓటర్లకు సంబంధించి జాబితాలో తప్పులు దొర్లడంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. జాబితాలో తప్పులు కారణంగా తమకు సానుకూలమైన ఓట్లు కోల్పోయామని ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.