సొంతిల్లు కలేనా! | Kalena sontillu! | Sakshi
Sakshi News home page

సొంతిల్లు కలేనా!

Oct 16 2014 1:37 AM | Updated on Oct 17 2018 4:13 PM

సొంతిల్లు కలేనా! - Sakshi

సొంతిల్లు కలేనా!

ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు(ఏపీహెచ్‌బీ) అధికారుల నిర్లక్ష్యం వల్ల లబ్ధిదారులకు సొంత ఇల్లు కలగానే మిగిలింది. డబ్బులు చెల్లించినా రోజుకో కారణం చెబుతూ జాప్యం చేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.

  • అంచనాలు పెంచారు.. నిర్మాణం మరిచారు
  •  హౌసింగ్ బోర్డు అధికారులు, కాంట్రాక్టర్‌ల నిర్లక్ష్యం
  •  32 మంది నుంచి రూ.2.50 కోట్లకు పైగా వసూలు
  •  అయినా మచిలీపట్నంలో ముందుకు సాగని గృహ నిర్మాణం
  •  ఇసుక కొరత పేరుతో జాప్యం
  •  మచిలీపట్నం : ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు(ఏపీహెచ్‌బీ) అధికారుల నిర్లక్ష్యం వల్ల లబ్ధిదారులకు సొంత ఇల్లు కలగానే మిగిలింది. డబ్బులు చెల్లించినా రోజుకో కారణం చెబుతూ జాప్యం చేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఏపీహెచ్‌బీ ద్వారా మచిలీపట్నంలో న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ ఫేజ్-2లో 32 గృహాలు నిర్మించేందుకు 2010 నవంబరులో అంచనాలు రూపొందించారు. 266 గజాల విస్తీర్ణంలో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని, ఇందుకోసం రూ.14 లక్షలు చెల్లించాలని ప్రతిపాదించారు. దీంతో 32 మంది ముందుకొచ్చారు. వారితో 2014నవంబరు లోపు ఇళ్లు నిర్మించి ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు.

    నిర్మాణ కాంట్రాక్టును హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తికి ఇచ్చినట్లు సమాచారం. పనులు ప్రారంభించాలంటే లబ్ధిదారులు 10శాతం నగదును ముందుగా చెల్లించాలని చెప్పారు. ఈ మేరకు లబ్ధిదారులు తొలి విడతగా రూ.1.40లక్షలు చెల్లించారు. ఆ తర్వాత విడతల వారీగా లబ్ధిదారులు రూ.9లక్షల వరకు చెల్లించారు. మొత్తం రూ.2.50కోట్లకు పైగా చెల్లించినా నాలుగేళ్లుగా గృహ నిర్మాణ పనులు పునాదుల దశను దాటలేదు. కాంట్రాక్టర్ హైదరాబాదులో ఉండటం, ఏపీహెచ్‌బీ ఈఈ కార్యాలయం విజయవాడలో ఉండటం, ఇక్కడున్న ఏఈ పనులను పట్టించుకోకపోవటంతో తమ ఇళ్లు ఎప్పుడు పూర్తవుతాయో అర్థం కావడంలేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  
     
    2013లో అంచనా వ్యయం పెంపు

    తొలుత 2010లో ఉన్న ధరల ప్రకారం అంచనాలు తయారు చేశామని, 2013 నాటికి సిమెంటు, ఇనుము, భవన నిర్మాణానికి ఉపయోగించే మెటీరియల్ ధరలు పెరిగాయని రూ.14 లక్షలకు గృహాలు నిర్మించి ఇవ్వలేమని ఏపీహెచ్‌బీ అధికారులు కొత్త ప్రతిపాదన చేశారు. పూర్తిస్థాయిలో గృహనిర్మాణం చేయాలంటే గతంలో నిర్ణయించిన రూ.14 లక్షలతోపాటు అదనంగా రూ.2,61,900 చెల్లించాలని విజయవాడ ఏపీహెచ్‌బీ ఈఈ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయించారు.

    ఈ వ్యవహారం మొత్తం 2013 నవంబరు నెలలో జరిగింది. ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదని, అయినప్పటికీ తాము పెంచిన నగదును చెల్లిస్తామని త్వరితగతిన గృహ నిర్మాణం పూర్తి చేయాలని లబ్ధిదారులు కోరారు. పెంచిన నగదు ప్రకారం లబ్ధిదారుల నుంచి నగదు కట్టించుకున్నారు. ఏపీహెచ్‌బీ ద్వారా నిర్మించే గృహాలకు నగదు కట్టిన వారిలో అధికంగా ఉద్యోగులే ఉన్నారు. వీరు వివిధ బ్యాంకుల ద్వారా గృహ నిర్మాణానికి సంబంధించి రుణాలకు దరఖాస్తు చేసుకుని వారు ఇచ్చిన పార్ట్ పేమెంట్‌లను ఏపీహెచ్‌బీకి చెల్లించారు.  
     
    అడుగడుగునా జాప్యం

    కాంట్రాక్టర్ నాలుగేళ్లలో మూడుసార్లు మాత్రమే మచిలీపట్నం వచ్చారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులు ప్రారంభించేలా కాంట్రాక్టర్‌పై ఏపీహెచ్‌బీ అధికారులు ఒత్తిడి చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కొంతకాలం సిమెంటు అందుబాటులో లేదని, మరోసారి ఇనుము ధరలు పెరిగాయని, ప్రస్తుతం ఇసుక కొరతని చెబుతూ కాంట్రాక్టర్ కాలయాపన చేస్తున్నారని లబ్ధిదారులు మండిపడుతున్నారు.

    చివరిసారిగా ఈ ఏడాది జూలైలో కాంట్రాక్టర్‌తో విజయవాడలో సమావేశం జరిగిందని, నవంబరు నాటికి గృహనిర్మాణాలు పూర్తి చేసి అప్పగిస్తానని చెప్పిన కాంట్రాక్టర్ ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదని వివరించారు. నాలుగేళ్ల క్రితం నిర్మించిన పునాదుల దశలోనే పనులు నిలిచిపోయాయని, అసలు నిర్మిస్తారా.. లేదా.. అని లబ్ధిదారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయంపై ఏపీహెచ్‌బీ ఏఈ రామ్‌కుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, ఇసుక కొరత వల్ల గృహ నిర్మాణాలు నిలిచిపోయాయని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement