తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి వద్దే పడుకున్న మహిళ
ప్రకాశం , నాగులుప్పలపాడు: ముందుగా చిన్నపాటి జ్వరం.. అనంతరం ఒకరోజులోనే కాలు కదపలేనంతగా నొప్పులు.. ఆపై విపరీతమైన జ్వరంతో కూడిన ఒళ్లు నొప్పులు... ఇదీ ప్రస్తుతం నాగులుప్పలపాడు మండలంలోని కనపర్తి గ్రామంలో ప్రజల పరిస్థితి. వారం రోజులుగా జ్వరాలతో గ్రామం మొత్తం మంచంపట్టింది. గ్రామంలోని తోపుపాలెం, రెడ్డిపాలెం, బలిజ కాలనీ, మేకల సోమయ్య పట్టపుపాలెంతో పాటు యానాది కాలనీలోని సుమారు 600 కుటుంబాల ప్రజలకు వారం రోజులుగా ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరికైనా జ్వరం రాకుండా లేదు. హఠాత్తుగా ఇలాంటి జ్వరాలు, తీవ్రమైన ఒళ్లు నొప్పులు రావడంతో గ్రామస్తులు అల్లాడిపోతున్నారు.
ప్రభుత్వ వైద్యం శూన్యం...
కనపర్తి గ్రామం అమ్మనబ్రోలు ప్రభుత్వ వైద్యశాల పరిధిలో ఉంది. అక్కడున్న ఇద్దరు డాక్టర్లు శిక్షణ నిమిత్తం గుంటూరు వెళ్లారు. ఆస్పత్రిలో సరైన వైద్యం చేసే వారు లేకపోవడంతో జ్వరపీడితులు కనపర్తిలోని ఆర్‌ఎంపీ వద్ద చికిత్స పొందుతున్నారు. మరికొందరు ఒంగోలు వెళ్లి చూపించుకుంటున్నారు. ఒకవైపు అంతుచిక్కని జ్వరాలతో అల్లాడిపోతూనే మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల్లో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ప్రభుత్వ వైద్యశాల నుంచి ఏఎన్‌ఎం వస్తున్నప్పటికీ సరైన మందులు లేకపోవడంతో పాటు వ్యాధి నిర్ధారణ చేయడం లేదు. వ్యాధుల నిర్ధారణ రికార్డులకే పరిమితమవుతోంది మినహా వ్యాధిని నయం చేయడానికి ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ కళ్యాణ చక్రవర్తి శిక్షణ నిమిత్తం 10 రోజులుగా అందుబాటులో లేకపోగా, మరో వైద్యురాలు రహీమున్నీసా ఇండక్షన్ ట్రైనింగ్ పని మీద 3 రోజుల పాటు అందుబాటులో ఉండరు. వీరికి బదులు ఇక్కడకు డాక్టర్ కులదీప్‌ను ఇన్‌చార్జిగా నియమించగా, రోగుల గురించి పట్టించుకోరు అని ఆయనకు పేరుండటంతో అక్కడికి ఎందుకులే అని రోగులే వెళ్లడం మానుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ వైద్యశాల మొహం చూసే వారు లేకుండా పోయారు. దీనిపై అమ్మనబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు కళ్యాణ చక్రవర్తిని వివరణ కోరగా, గ్రామంలో విష జ్వరాలు ప్రబలిన విషయం తమ దృష్టికి వచ్చిందని, క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రెండు రోజుల నుంచి ఒళ్లు నొప్పులు తీవ్రంగా ఉన్నాయి
రెండు రోజుల క్రితం పనికి వెళ్లగా, తీవ్రమైన ఒళ్లు నొప్పులు వచ్చాయి. దీంతో పని చేయలేక ఇంటికి వచ్చాను. అప్పటి నుంచి కాలు తీసి బయట పెట్టలేకపోతున్నాను. కుటుంబ సభ్యులు ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అకస్మాత్తుగా ఇంత భయంకరమైన నొప్పులతో కూడిన జ్వరం రావడం ఏంటో అర్థం కావడం లేదు.– కోటుపల్లి శ్రీనివాసరావు, కనపర్తి
Comments
Please login to add a commentAdd a comment