
మా ఆవిడకు ఓటేయరూ!!
పొడవాటి బుర్ర మీసాలు.. బట్టతల.. భారీ విగ్రహం.. ఇవన్నీ ఒక్కసారి చెబితే చాలు, ఆయన పేరేంటో ఆ మనిషేంటో వెంటనే తెలుస్తుంది. ఆయనెవరో కాదు.. టీటీడీ చైర్మన్, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండి, ఎన్నికలు రాగానే ప్రతి ఒక్కరినీ అక్కా, చెల్లీ, అల్లుడూ అంటూ సొంత మనుషుల్లా పలకరించి ఎలాగోలా గెలిచేయడం ఆయనకు ఇన్నాళ్లూ అలవాటు. కానీ ఇప్పుడు అలాంటిది ఆయన రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకం అయ్యింది. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా.. నరసాపురం నుంచే బరిలోకి దిగుతారా.. లేదా అక్కడ తన భార్య అన్నపూర్ణను పోటీ చేయిస్తారా అనే ప్రశ్నలు ఇప్పుడు ఈ ప్రాంతంలో వినిపిస్తున్నాయి.
ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవి చేపట్టడానికి కొద్ది సమయం ముందు ఆయనను స్వయంగా కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ప్రసాదం అందించిన వ్యక్తి.. బాపిరాజు. ఆయన గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, రెండుసార్లు ఎంపీగా ఎన్నికై రాష్ట్ర్ర దేవాదాయ, ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా పనిచేసిన సీనియర్ నాయకుడు. విభజన నేపథ్యంలో ఎన్నికల్లో ఓటమి తప్పదని భయపడుతున్న కనుమూరి.. తన బదులు తన భార్యను ఎన్నికల బరిలో దింపడం ద్వారా ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవాని చూస్తున్నారట. అన్నపూర్ణమ్మకు నరసాపురం, భీమవరం, పాలకొల్లు.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా నియోజకవర్గాలలో ముఖ పరిచయాలు ఉండటంతో పాటు పలు సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. టీటీడీలో ఏ కార్యక్రమం జరిగినా ఈ దంపతులు ఇద్దరూ కలిసే పాల్గొంటారు. కనుమూరి రాజకీయ విజయం వెనుక అన్నపూర్ణమ్మ ఉన్నారని నియోజకవర్గ ప్రజలు చెబుతుంటారు. దీంతో ఆమెను రంగంలోకి దింపడం ద్వారా కాంగ్రెస్కు వీరవిధేయుడిగా కొనసాగడంతో పాటు కొత్తముఖాన్ని ప్రజలకు పరిచయం చేసినట్టు ఉంటుందని కనుమూరి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు బాపిరాజు తమ్ముడి కుమారుడు రఘురామకృష్ణంరాజు ప్రత్యర్ధిగా నర్సాపురం బరిలో ఉండటం వల్ల కనుమూరి పోటీకి దిగుతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. తమ్ముడి కొడుకు రాజకీయాల్లోకి అడుగు పెడుతుండటంతో ముందు చూపుగా తన భార్యను రంగంలోకి దింపాలనే ఆలోచన ద్వారా కొత్త ఎత్తుగడకు తెరలేపారని కూడా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అధిష్టానానికి విధేయంగా ఉండి.. తర్వాత రాజ్యసభ సీటు తెచ్చుకోవచ్చన్నది బాపిరాజు ఐడియానట. ఇదే సమయంలో సీఎం కిరణ్ తోనూ కనుమూరి సత్సంబంధాలు కొనసాగిస్తుండటం విశేషం!!