కాపు రుణాల మంజూరు.. పక్కా మోసం
► ప్రకటించింది రూ.2 లక్షలు.. ఇచ్చేది రూ.60 వేలు
► తీవ్ర అసంతృప్తిలో కాపు నాయకులు
నెల్లూరు(సెంట్రల్): రుణాల మంజూరు విషయంలో ప్రభుత్వం కాపులను పక్కాగా మోసం చేసిందని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. కాపులను ఆదుకోవడానికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఇస్తామని చెప్పి సర్కారు మాటలు నీటిమూటలయ్యాయి. తీరా రుణం కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత ఒక్కొక్కరికి ఇచ్చేది రూ.60 వేలు మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. దీంతో దరఖాస్తుదారులు అవాక్కవుతున్నారు. ఇంత మోసమా అంటూ కాపు నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
లెక్క ఇలాగా..
కాపు కార్పొరేషన్ కింద సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే రూ.60 వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాకు రూ.7 కోట్లు కేటాయించింది. 2462 మందికి రుణాలు ఇస్తామని ప్రకటలు గుప్పించింది. దీంతో జిల్లాలో కాపు వర్గానికి చెందిన 12,714 మంది దరఖాస్తులు చేసుకున్నారు. తీరా కాపు కార్పొరేషన్ తరపున లబ్ధిదారులకు వచ్చే సబ్సిడీ రుణం ఎంతో తెలిసి నోరు వెళ్లబెడుతున్నారు. మొత్తం బ్యాంకు ఇచ్చే నగదు రూ. 60 వేలు సబ్సిడీ రుణం కాగా అందులో కాపు కార్పొరేషన్ ఇచ్చేది రూ.30 వేలు సబ్సిడీ మాత్రమే. అందుకు గాను జన్మభూమి కమిటీ ఆమోద ముద్ర తప్పని సరిగా పెట్టారు.
బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొం దాలంటే కనీసం జన్మభూమి కమిటీకి కొంత ముట్టచెప్పాలి. ఇక దరఖాస్తులు చేసుకోవడానికి, కుల ధ్రువీకరణ పత్రం, రుణం ఫైనల్ చేసుకునే సరికి లబ్ధిదారునికి సుమారు రూ.10 వేల వరకు ఖర్చువుతోందని తెలిసింది. లబ్ధిదారుని చేతికి వచ్చేది ఇక రూ.20 వేలు మాత్రమే.
విసిగిపోతున్న దరఖాస్తుదారులు
అటు జన్మభూమి కమిటీల పెత్తనం, మరో పక్క చాలా వరకు బ్యాంకుల నుంచి తలనొప్పులు ఎదురౌతున్నాయని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రుణాలు మాబ్యాంకు నుంచి ఇస్తున్నాం.. జన్మభూమి కమిటీల పెత్తనం ఏమిటని పలువురు బ్యాం క్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ రుణాలు ఇస్తుందని, తమను కమిటీ సభ్యులుగా నియమించిందని తాము చెప్పిన వారికే రుణాలు ఇవ్వాలని కమిటీ సభ్యుల హుకుం జారీ చేస్తున్నారు.
అటు బ్యాంకు అధికారులు, ఇటు కమిటీ సభ్యుల మధ్య కోల్ట్‌వార్‌తో దరఖాస్తుదారులు విసిగిపోతున్నారు. బ్యాంకు ల, కమిటీ సభ్యుల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే బీసీ కార్పొరేషన్ ఈడీ మాత్రం ఇవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని కాపు నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక జిల్లా అధికారి కనీ సం రుణాల విషయంలో జోక్యం చేసుకోకుండా మౌ నంగా చూస్తుండడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా కాపులను రుణాల పేరుతో ప్రభుత్వం మోసం చేసిందని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.