
అంబాజీపేట: సాధ్యం కాని పనిని చేస్తానంటూ హామీ ఇచ్చి కాపులను నట్టేట ముంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులా కాకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఒక్కరే కాపులకు న్యాయం చేస్తారని పలు కాపు నాయకులు అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా తుని క్యాంపు కార్యాలయం వద్ద వివిధ జిల్లాల కాపు సంఘ నాయకులు జననేత జగన్‌ను కలిసి దుశ్శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా ప్రభాకర్ మాట్లాడుతూ కాపు ఉద్యమం ప్రారంభం నాటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించి కాపులపై చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. కాపు రిజర్వేషన్ పోరాటానికి ఎప్పటికప్పుడు సహకారం అందించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో జగన్ ముందున్నారన్నారు. చంద్రబాబు నాయుడు కాపు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడం కోసం ఆదరాబాదరగా కమిషన్ వేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారన్నారు. రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.
ఆ విషయాన్ని జగన్ చెప్పడం తప్పుగా ఎల్లో మీడియా, చంద్రబాబు వక్రీకరించి తప్పు చేసేవాడిగా చిత్రీకరిస్తున్నారన్నారు. నాలుగున్నరేళ్ల నుంచి గుర్తుకురాని కాపులపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాపులను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు, తన ఎల్లో మీడియా సిద్ధపడుతోందని, ఈ విషయంలో కాపులందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. వైఎస్సార్ సీపీ వెంటే 80 శాతం మంది కాపులున్నారని, రాబోయే రోజుల్లో జగన్‌కే మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. వివిధ జిల్లాలకు చెందిన కాపు నాయకులు చేగొండి శ్రీనివాసరావు, మెడికల్ బాబు, జి.నరసింహరావు, కె.ఎన్.రావు తదితరులు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.