రావులపాలెం, న్యూస్‌లైన్:కాపు కులస్తులకు చాలాకాలం నుంచి ఉన్న రిజర్వేషన్లను పునరుద్ధరిస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉంటుందని రాష్ట్ర తెలగ, బలిజ, కాపు(టీబీకే) జాయింట్ యాక్షన్ కమిటీ కోఆర్డినేటర్ దాసరి రాము ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాపు, తెలగ, బలిజ కులాలను బీసీ జాబితాలో చేర్చాలని కోరారు. హైదరాబాద్‌పై రాష్ట్రంలో అందరికీ హక్కు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రావులపాలెం జాతీయ రహదారిని కోనసీమ టీబీకే జేఏసీ ఆధ్వర్యంలో దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా కళావెంకట్రావు సెంటర్‌లో రాష్ట్ర కాపునాడు నేత, డీసీసీబీ మాజీ డెరైక్టర్ ఆకుల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో రాము మాట్లాడుతూ 2004 కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ ప్రకారం తెలగ, బలిజ, కాపు కులస్తులకు వెంటనే బీసీ రిజర్వేషన్లు వర్తింపజేయాలన్నారు.
1910-1966 మధ్య అమలైన రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వాలే రద్దు చేశాయన్నారు. దీంతో కాపు కులస్తుల విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అడుగంటాయన్నారు. ముద్రగడ పద్మనాభం, సలాది స్వామినాయుడు, నల్లా సూర్యచంద్రరావు తదితరుల ఉద్యమాలతో 1994లో కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ 30 విడుదల చేసిందన్నారు. ఎవరి పోరాటంతో ఈ జీఓ జారీ అయిందో వారినే ప్రభుత్వం విస్మరించిందని ఆయన మండిపడ్డారు. 2004 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు మూడు నెలల్లో 4శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే కాపు రిజర్వేషన్ల అంశం కూడా ఉన్నప్పటికీ అమలు చేయకపోవడం కాపులను మోసం చేయడమేన్నారు.
ఇప్పటికైనా ఈ రిజర్వేషన్లు పునరుద్ధరించకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు కాపులు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ అనేక కాపు ఉద్యమాలకు రావులపాలెం వేదికగా నిలిచిందని గుర్తు చేశారు. తమకు న్యాయం చేసే పార్టీలకే కాపులు పట్టం కట్టాలన్నారు. రాజకీయాలను శాసించేలా ఏక తాటిపై ఉద్యమించాలన్నారు. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ల సాధనకు కృషిచేసే పార్టీలను గెలిపించేందుకు కాపులు కట్టుబడి ఉండాలన్నారు. తమకు ప్రత్యేక రిజర్వేషన్లు కోరుతున్నాం తప్ప బీసీ రిజర్వేషన్లలో వాటా పంచమని అడగడంలేదన్నారు.
వైఎస్సార్ సీపీ పి.గన్నవరం కోఆర్డినేటర్ మిండగుదిటి మోహన్ మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ల సాధనకు నాయకులందరూ పార్టీలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కోనసీమ టీబీకె కన్వీనర్ కల్వకొలను తాతాజీ, రావులపాలెం కాపు సంఘం అధ్యక్షుడు నందం వీరవెంకటసత్యనారాయణ, మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరరావు ఇంకా బండారు శ్రీను, సాధనాల శ్రీనివాసరావు, ఆకుల భీమేశ్వరరావు, సలాది రామకృష్ణ పాల్గొన్నారు.
కాపు రిజర్వేషన్లతోనే కాంగ్రెస్‌కు మనుగడ
Published Mon, Nov 18 2013 1:39 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement