భవిష్యత్తుకు దారేది?
గందరగోళంలో టీడీపీ, కాంగ్రెస్ నేతలు
సాక్షి, మంచిర్యాల : ఆకర్షణ వల, అభద్రత స్థితిలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని గందరగోళంలో జిల్లాలోని పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలున్నారు. టీఆర్‌ఎస్ నాయకులు తమ పార్టీలో ఇతర పార్టీల నాయకులు చేరితే రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు ఇప్పిస్తామని ఆశ కల్పిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులకు భవిష్యత్తుపై భయం పట్టుకుంది. పార్టీ పరిస్థితిని చూసి ఐదేళ్ల భవిష్యత్తును ఊహించుకుంటే పార్టీ మారడమే మంచిదనే ఆలోచన ఒకవైపు, ఇన్నాళ్లు నమ్ముకున్న పార్టీని వదిలేస్తే ఎలాంటి చర్చకు దారితీస్తుందోననే ఆందోళన మరోవైపు వారిని పట్టిపీడిస్తోంది. ఇదే సమయంలో ఇరు పార్టీల అగ్రనేతలు శ్రేణులకు మార్గదర్శనం చేసే పరిస్థితులు మృగ్యమయ్యాయి.
హస్తవ్యస్తం
జిల్లా నేతలు, రాష్ట్ర నాయకత్వం పార్టీని ఎటువైపు తీసుకుపోతుందో అర్థం కావడంలేదని జిల్లా కాంగ్రెస్ శ్రేణులు వాపోతున్నాయి. సమావేశాలు, సమీక్షల విషయంలో గందరగోళం ఉందని పేర్కొంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు లక్ష్మయ్య జిల్లా పర్యటన వాయిదా పడి పక్షం అయినా తదుపరి తేదీ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో తమకు మార్గదర్శనం చేసేవారు లేక కొందరు కాంగ్రెస్ నేతలు అధికార టీఆర్‌ఎస్ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. జిల్లాలోని ఓ కాంగ్రెస్ నాయకుడు ఈ మేరకు గులాబీ పార్టీ అగ్రనేతలతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం.
సేమ్ టు సేమ్..
టీడీపీలో కూడా కాంగ్రెస్ పార్టీ వంటి పరిస్థితి నెలకొంది. జిల్లాలో కీలక నాయకుడుగా ఉండే ఓ నేత ఓటమి పాలైన తర్వాత తమతో భేటీ అవడమే గగనం అయిపోయిందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. సదరు నాయకుడు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు దగ్గర అని చెప్పుకోవడమే తప్ప తమ నియోజకవర్గ పరిస్థితులు, పార్టీ స్థితిగతులు, పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలేవి చేపట్టడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ అగ్రనేతలు, తెలంగాణ బాధ్యులతో క్షేత్రస్థాయి సమీక్ష చేపట్టడమనేది అతీగతీ లేదని మండిపడుతున్నారు. ఈ రెండు పార్టీల్లోని పరిస్థితులను గ్రహించిన అసంతృప్త నేతలకు గాలం వేసే పనిలో టీఆర్‌ఎస్ బిజీగా ఉంది. జిల్లాలోని అసంతృప్త నేతలు వివరాలు నియోజకవర్గం వారిగా సేకరించే పనిలో గులాబీ దండు ఉన్నట్లు సమాచారం.