ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాప్రజలను మోసం చేసిందని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ విమర్శించారు.
విశాఖపట్నం (అల్లీపురం): ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాప్రజలను మోసం చేసిందని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ విమర్శించారు. విశాఖపట్నంలోని ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా హుద్-హుద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో విఫలమైందని పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమలకు విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ప్యాకేజీ అమలు చేయకుండా, ఏపీ లోటు బడ్జెట్ పూరించకుండా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని ఆయన దుయ్యబట్టారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని ప్రజాసంఘాలను, రాజకీయ పార్టీలను కలుపుకుని ప్రత్యేక హోదా విషయంలో పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని కారెం శివాజీ ఈ సందర్భంగా కేంద్రాన్నిహెచ్చరించారు.