కార్తీకమాసం మొదటి సోమవారం విజయవాడ భ్రమరాంభమల్లేశ్వర స్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది. తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులు కృష్ణానదిలో స్నానాలాచరించి కార్తీక దీపాలు వెలిగించారు. మహాశివుడికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. దీపాల వెలుగులతో ఆలయం మరింత శోభను సంతరించుకుంది. బ్రమరాంభ మల్లేశ్వర స్వామి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
గుంటూరు జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం కోటప్ప కొండ భక్తులతో నిండిపోయింది. కార్తీకపూజల కోసం భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి 30 వేల మంది వస్తారని అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు.
తూర్పుగోదావరి జిల్లాల్లోని శివాలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. అన్నవరం సత్యదేవుని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామునుంచే భక్తులు పెద్దసంఖ్యలో సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. మహిళలు రావిచెట్టు వద్ద పూజలు చేసి దీపాలు వెలిగించారు. స్వామివారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.
కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో పశ్చిమగోదావరి జిల్లాల్లోని శైవక్షేత్రాలన్నీ కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ.. మహాశివుడిని దర్శనం చేసుకుంటున్నారు. కార్తీక మాసం శివునికి ఎంతో ఇష్టమైన మాసమని, అలాంటి కార్తీక మాసంలో అందులోనూ సోమవారం ఆ మహాశివుడిని ఆరాధిస్తే.. పుణ్యఫలాలు దక్కుతాయని ప్రతీతి. ఈ మాసంలో శివ శివ అని స్మరిస్తే చాలు.. ఆ దేవదేవుడు కరుణిస్తున్నాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే కార్తీక మాసంలో భక్తులు సైతం శివారాధన కోసం ఆలయాలకు పోటెత్తారు. కార్తీక దీపాలు వెలిగించి.. నీలకంఠుడికి అభిషేకాలు చేయిస్తున్నారు. ముఖ్యంగా పంచారామక్షేత్రాలైన ద్రాక్షారామం, సామర్లకోట శివాలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని ఘాట్లన్నీ భక్తజన సందోహంతో నిండిపోయాయి.
శ్రీకాకుళం జిల్లాలోనూ కార్తీక సోమవారం పూజలు వైభవంగా జరుగుతున్నాయి. టెక్కలి మండలం రావివలస గ్రామంలోని శ్రీ ఎండల మల్లికార్జునస్వామివారి ఆలయంలో కొలువైన అతిపెద్ద శివలింగాన్ని దర్శించుటకు భక్తులు తరలివస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచే కాకుండా.. ఇతర జిల్లాల నుంచి భక్తులు వందలాదిగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంగణంలో శివనామస్మరణలు మారుమోగుతున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా తెల్లవారు జామున మూడు గంటల నుంచే గోదావరి నదిలో పుణ్యస్నానాలాచరించారు. పెద్దసంఖ్యలో వచ్చిన మహిళలు నదిలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు . ఆలయంలోని మహాశివునికి అభిషేకాలు చేశారు. గోదావరితీరం దీపాల కాంతితో శోభాయమానంగా మారింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడు శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మారుమోగుతోంది. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అనంతరం మహాశివుడు భక్తులకు దర్శనమిచ్చాడు. తెల్లవారుజామునుంచే ధర్మగుండంలో పుణ్యస్నానాలాచరించి కార్తీక దీపాలను వెలిగించి కోడె మొక్కులు తీర్చుకున్నారు . భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అర్జిత సేవలను రద్దు చేసి భక్తులకు లఘు దర్శనం కల్పించారు. నల్లగొండ జిల్లాలోని యాదాద్రి సహా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోనూ భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు.
Comments
Please login to add a commentAdd a comment