
కాపుకాసి కాటేశాడు ..!
బాపట్ల/ బాపట్లటౌన్:ఇంటర్మీడియెట్ విద్యార్థిని మండ్రు ప్రత్యూష(17)హత్య కేసులో మిస్టరీ వీడుతోంది. ఆమె పినతండ్రే హతమార్చి ఉంటాడని పోలీసులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో పినతండ్రిని అనుమానించిన పోలీసులు సోమవారం రాత్రి అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
అయితే ఇందులో ఇతను ఒక్కడే ఉన్నాడా, మరెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గుంటూరులో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరమే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
బాపట్లలో ఇంటర్మీడియెట్ విద్యార్థిని ప్రత్యూషను హత్య చేసి, మృతదేహాన్ని వ్యవసాయ మార్కెట్ యార్డు వెనుక దొరువు(ఎండిపోయిన నీటిగుంత)లో పడేసి చెత్తతో కప్పేసిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
డీఎస్పీ కె.సుధాకర్ నేతృత్వంలో రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని బయటుకు తీసి కేసు దర్యాప్తు చేపట్టారు. పైజమా మృతురాలి మెడకు చుట్టి ఉండడం, నాలుక బయటకు వచ్చి ఉండడం వంటి అంశాల ఆధారంగా విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడి, ఆపై హత్యచేసి ఉంటారని భావించిన పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు.
ఇదిలావుండగా, ప్రత్యూష తల్లి మండ్రు సుబ్బమ్మ భర్త చనిపోయినప్పటి నుంచి మండలం లోని ఈతేరు గ్రామానికి చెందిన ఎం.మురళి అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. మురళికి భార్య, కుమార్తె కూడా ఉన్నారు.
పినతండ్రి తీసుకెళ్లాడు...
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఈ నెల ఆరవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల సమ యంలో కళాశాల నుంచి ఇంటికి వచ్చిన ప్రత్యూషను ‘మీ అమ్మ నిన్ను నన్ను పుల్లలకు వెళ్లి రమ్మంది’ అంటూ పినతండ్రి మురళి ఆంధ్రకేసరినగర్ సమీపంలోని మార్కెట్‌యార్డులో ఉన్న చెట్లలోకి తీసుకె ళ్లినట్టు చెపుతున్నారు. అక్కడ అతి కిరాతకంగా ప్రవర్తించి, ఆపై హత్యచేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలంలో మురళి పర్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
బాపట్ల ఇన్‌చార్జి డీఎస్పీ కె. సుధాకర్ తన సిబ్బందితో రంగంలోకి దిగి ప్రత్యూష హత్యకేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పలువురిని అదుపులోకి తీసుకొని విచారించారు. సోమవారం రాత్రి మురళిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, తానే ఈ హత్యకు పాల్పడినట్టు చెప్పాడని సమాచారం. సీఐ మల్లిఖార్జునరావు, సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐలు కూడా కేసు దర్యాప్తులో పాల్గొంటున్నారు.
నిందితుడిని శిక్షించాలని డిమాండ్....
ప్రత్యూష హత్యకేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానిక మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ విద్యార్థినిపై లైంగిక దాడికిపాల్పడి, హత్యచేశారని తెలియడంతో పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన మహిళలు స్థానిక మార్కెట్‌యార్డుకు తరలివచ్చి ఆందోళన వ్యక్తం చేశారు.