ప్రకాశం జిల్లాలో శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతిచెందాడు.
ఉలవపాడు : ప్రకాశం జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతిచెందాడు. విశాఖపట‍్టణం నుంచి తిరుపతికి వెళుతున‍్న కావేరి ట్రావెల్స్ బస్సు ఉలవపాడు మండలం మన్నేటికోట గ్రామ శివార్లలో ముందు వెళుతున‍్న గ్రానైట్ లారీని ఢీకొంది.
ఈ ఘటనలో బస్సు డ్రైవర్ రాజు సీటులో ఇరుక్కుని గంటపాటు మృత‍్యువుతో పోరాడి ప్రాణాలు వదిలాడు. బస్సులోని 31 మంది ప్రయాణికులు అత‍్యవసర ద్వారం ద్వారా బయటికి దిగారు. ప్రయాణికులను మరో బస్సులో తిరుపతి పంపారు. సమాచారం అందుకున‍్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ రాజును ప్రాణాలతో బయటికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.