కావూరి కొత్త నాటకం నేనేం చేయాలి!
‘నా బాధ్యతల్ని శక్తి మేరకు చిత్తశుద్ధితో నిర్వహించినా పార్టీ నిర్ణయం కారణంగా మీకు నొప్పి కలిగించానేమో. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలో మీరే చెప్పండి.
బహిరంగ లేఖలతో మభ్యపెట్టే యత్నం
ఇప్పటికీ కేంద్ర పదవిని వదలని వైనం
టీడీపీలో చేరేందుకు సన్నాహాలు
మరో ఎత్తుగడగా ప్రజల గుసగుసలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘నా బాధ్యతల్ని శక్తి మేరకు చిత్తశుద్ధితో నిర్వహించినా పార్టీ నిర్ణయం కారణంగా మీకు నొప్పి కలిగించానేమో. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలో మీరే చెప్పండి. మీ నిర్ణయం కోసం ఎదురుచూస్తూ...’ అంటూ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఎన్నికల తరుణంలో బహిరంగ లేఖల పేరుతో జనాన్ని మరోసారి బుట్టలో వేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల తాను చేసిన అభివృద్ధి పనులు, పార్లమెంటులో తన ప్రతాపం తదితర వివరాలతో ఆయన ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాశారు. అందులో చివర లైనులో ప్రజలు చెప్పినట్లు చేస్తానని, ఏంచేయాలో చెప్పాలని ఎంతో వినమ్రంగా వేడుకున్నారు. ఈ లేఖను కరపత్రాలుగా ముద్రించి ఏలూరు పార్లమెం టరీ నియోజకవర్గంలో విస్తృతంగా పంపిణీ చేస్తున్నా రు. ఆ కరపత్రంపైఒక ఫోన్ నంబరు కూడా ఇచ్చి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుండటం విశేషం.
సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో జనం రాజీనామా చేయాలని అడ్డుకున్నా, ఘెరావ్ చేసినా, నెత్తీనోరూ మొత్తుకున్నా పదవిని వదలని ఆయన ఇప్పుడు అదే జనాన్ని ఆకట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొదట్లో సమైక్యాంధ్ర కోసం నిజాయితీగా పనిచేస్తున్న నేతగా బిల్డప్ ఇచ్చిన కావూరి ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన తర్వాత ఆ ఉద్యమాన్నే ఎగతాళి చేసి మాట్లాడటం ఎవరూ మరచిపోలేని విషయం. సమైక్యవాదులు, జనాన్ని వెదవలు, దరిద్రులంటూ ఇష్టానుసారం తిట్టిన కేంద్ర మంత్రివర్యులు ఎన్నికలు ముంచుకురావడంతో ఇప్పుడు వారి కే లేఖలు పంపించి ఎంతో వినమ్రంగా ఏంచేయాలో చెప్పండంటూ ఆడుతున్న నాటకం వెగటు పుట్టించేలా ఉందని ఆయన అనుయాయులే అనుకుంటున్నారు.
ప్రజలను పట్టించుకోక..పదవిని వీడక..
రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో ప్రజలు రాజీమానా చేయమని డిమాండ్ చేసినా మంత్రి కావూరి ఏ మాత్రం పట్టించుకోలేదు. పలుమార్లు ఆయన్ను సమైక్యవాదులు అడ్డగించినా లెక్కచేయలేదు. రాష్ట్ర విభజన జరిగిపోతున్న సమయంలోనూ విభజన జరగదని, పార్లమెంటులో తన సత్తా చూపిస్తానని ఉత్తర కుమార ప్రగల్భాలతో అందరినీ గందరగోళంలో పడేశారు. చివరికి కేంద్ర కేబినెట్ సమావేశంలో విభజనకు అంగీకరించి రాయల తెలంగాణ ప్రతిపాదన తీసుకువచ్చి మరింత చులకనయ్యారు. పార్లమెంటులోనూ రకరకాల డ్రామాలు ఆడారు. చివరికి విభజన జరిగిన తర్వాత కూడా ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోలేదు. ఇంకా కేంద్ర పదవిని పట్టుకుని వేలాడుతూనే ఉన్నారు. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో జనాన్ని ఎలాగోలా మభ్యపెట్టేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే ఆయన పంపిణీ చేయిస్తున్న బహిరంగ లేఖలు కొద్దిరోజులుగా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో చర్చనీయాంశమయ్యాయి.
ఏలూరు నుంచే పోటీకి తహతహ
కాంగ్రెస్ పార్టీలో అత్యంత అనుభవం ఉన్న నాయకుడిగా చెప్పుకునే మంత్రి కావూరి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఈ లేఖల భాగోతానికి తెరదీసినట్టు ప్రచారం జరుగుతోంది. మళ్లీ ఏలూరు లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేయాలని భావిస్తున్న ఆయన కాంగ్రెస్ నుంచి రంగంలోకి దిగితే డిపాజిట్లు కూడా రావనే అభిప్రాయనికి వచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో జనాన్ని మభ్యపెట్టేందుకు సర్వదా ప్రయత్నిస్తున్నా రు. ఏలూరు ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేశానని.. ప్రజలకే కట్టుబడి ఉన్నాననే ప్రచారాన్ని ముమ్మరంగా చేయిస్తున్నారు.ప్రజల్లో తనపై తీవ్రంగా ఉన్న ఆగ్రహాన్ని కొంతవరకైనా చల్చార్చి టీడీపీ తరఫున ఎంపీ గా బరిలోకి దిగాలనేది ఆయన ఎత్తుగడగా కనిపిస్తోంది.