'కావూరికి ద్వారాలు తెరిచి లేవు'
ఏలూరు : కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు తెలుగుదేశం పార్టీలో రావటాన్ని ఆపార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కావూరికి టీడీపీ ద్వారాలు తెరిచి లేవని టీడీపీ నేత, మాజీమంత్రి మాగంటి బాబు వ్యాఖ్యానించారు. ఒకవేళ కావూరిని టీడీపీలోకి వస్తే పశ్చిమ గోదావరి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లోనూ ఫలితాలు తారుమారు అవుతాయని ఆయన హెచ్చరించారు. జరగబోయే ఎన్నికల్లో రెండు లక్షల మెజార్టీతో తన గెలుపు ఖాయమని మాగంటి బాబు ధీమా వ్యక్తం చేశారు.
కాగా మొదట్లో సమైక్యాంధ్ర నినాదం అందుకుని.. కేంద్ర కేబినెట్‌లో స్థానం లభించిన అనంతరం సమైక్యవాదులను ‘వెధవలు.. దద్దమ్మలు’ అంటూ తిట్టిపోసిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు రాజకీయ భవిష్యత్ కోసం కొత్త పాచిక వేశారు. తెలుగుదేశం పార్టీలో చేరాలనే యోచనలో ఉన్న ఆయన మూడు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యూరు.
తన మనసులోని మాటను నాయకులతో బయటపెట్టించారు. ఇదే సందర్భంలో ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాగం టి బాబు గెలిచే అవకాశం ఉంటే తాను టీడీపీలోకి వెళ్లాల్సిన పనిలేదని కావూరి పేర్కొన్నారు. పరోక్షంగా మాగంటి బాబుకు గెలిచే అవకాశం లేదని, తనకు అభ్యర్థిత్వం ఇస్తే గెలుస్తాననే విధంగా టీడీపీ నాయకులకు సంకేతాలు పంపించారు.
‘నేనేం చేస్తే బాగుంటుంది. మీరేం అనుకుంటున్నారు’ అని రాసిన ప్రశ్నాపత్రాలను సభకు హాజరైన వారి చేతిలో పెట్టారు. ఆ ప్రశ్నలకు కాంగ్రెస్‌లోనే కొనసాగాలి, టీడీపీకి వెళ్లాలి, వైఎస్సార్ సీపీకి వెళ్లాలి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలి అనే జవాబులు ఇచ్చి వాటి ఎదురుగా ఉన్న గడిలో టిక్ చేయూలని సూచించారు. చివరకు ఎక్కువ మంది టీడీపీలో చేరాలనే రాసినట్టు సమాచారం.