చిచ్చురేపుతున్న కాంగ్రెస్ నేతలు
వారికే అగ్రతాంబూలం ఇస్తున్న అధిష్టానం
ఘెల్లుమంటున్న తమ్ముళ్లు
మాగంటి బాబు, ఇతర నేతల్లో తీవ్ర అసంతృప్తి
జిల్లాలో వెలిసిపోరున పసుపు జెండాకు టీడీపీ అధినాయకత్వం కొత్త రంగు అద్దుతోంది. నిన్నటి వరకూ కాంగ్రెస్ పెద్దలతో చెట్టాపట్టాలేసుకుని తిరిగి.. రాష్ర్ట విభజనకు సహకరించిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ నేతలను పిలిచి మరీ పచ్చకండువా కప్పుతున్నారు.
నియోజకవర్గాలు, పట్టణాల్లో ప్రత్యర్థులుగా ఉన్న నాయకులతో కలసి కాపురం చేయూలంటూ తమ్ముళ్లకు హుకుం జారీ చేస్తున్నారు. అధినేత తీరును పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఓటర్లు ఆదరించకపోరునా.. పదేళ్లుగా అధికారానికి దూరమైనా.. ఏదో ఒక రోజున అవకాశం రాకపోతుందా అన్న దింపుడు కళ్లం ఆశలతో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులను తన స్వార్థం కోసం అధినేత అధఃపాతాళానికి తొక్కేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
‘అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో’ అనే సామెతకు తెలుగుదేశం పార్టీ అసలైన అర్థం చెబుతోంది. ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారిని పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ నుం చి వచ్చే నాయకులకు అధిష్టానం పెద్దపీట వేస్తుం డటం తెలుగుదేశం పార్టీలో చిచ్చురేపుతోంది.
ప్రజాభిమానం కోల్పోరు.. అన్నిదారులూ మూసుకుపోవడంతో మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే ఈలి నాని టీడీపీలో చేరిపోయారు. కాంగ్రెస్‌లో సూపర్ సీనియర్‌నని చెప్పుకునే కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు, భీమవరం, తణుకు ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, కారుమూరి నాగేశ్వరరావు సైతం గత్యంతరం లేక అదే బాటలో పయనిస్తున్నారు.
వీరంతా టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద సీట్లను రిజర్వు చేసుకుని టీడీపీలోకి వస్తుండటం పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. కిందిస్థాయి కార్యకర్త నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకూ ప్రతి ఒక్కరూ అధినేత తీరుపై విరుచుకుపడుతున్నారు. బహిరంగంగా మాట్లాడకపోయినా అంతర్గతంగా చంద్రబాబు వ్యవహార శైలిని తప్పు పడుతున్నారు.
మాగంటి బాబు ఆగ్రహం
కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తుండటం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి మాగంటి బాబు కు మింగుడు పడటం లేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కీలకంగా పనిచేసిన తనను కాదని కావూరికి సీటు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. పార్టీని నేరుగా తిట్టలేక కావూరిపై విరుచుకుపడ్డారు.
ఆయనవల్లే రాష్ట్రం విడిపోయిందని, కావూరి జెడ్‌పీటీసీగా కూడా గెలవలేరని బాబు విమర్శించారు. ఆయన టీడీపీలోకి వస్తే సీమాంధ్రలో పార్టీకి నష్టం తప్పదని కుండబద్దలు కొట్టారు. మాగంటి నేరుగా కావూరిపై విమర్శలు చేయడానికి కారణాలు లేకపోలేదు.
కొద్దిరోజుల క్రితం ఏలూరులో నిర్వహించిన సమావేశంలో మాగంటి గెలిచే అవకాశం ఉంటే టీడీపీ నాయకులు తనను ఎందుకు రమ్మని కోరతారని కావూరి అనటం మాగంటి వర్గీయులకు కోపం తెప్పించింది. దీంతో వారంతా కావూరిపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కావూరిని పార్టీలోకి రాకుండా ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కావూరి టీడీపీలో చేరేందుకు ఉన్నత స్థాయిలో లాబీ నడుపుతున్నారు.
ఘెల్లుమంటున్న గూడెం టీడీపీ
తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే ఈలి నాని టీడీపీలో చేరడాన్ని అక్కడి టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొట్టుకు తాడేపల్లిగూడెం సీటిస్తే తాము పనిచేసేది లేదని అక్కడి నేతలు, కార్యకర్తలు హెచ్చరికలు చేస్తున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ముళ్లపూడి బాపిరాజు ఈ విషయంపై అధినేత వద్దే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
అయినా చంద్రబాబు పట్టించుకోకుండా వారిద్దరినీ పార్టీలోకి ఆహ్వానించడంతో స్థాని క నాయకత్వం డోలాయమానంలో పడింది. మొదటి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారిని కాదని కొత్త వారికి సీటిస్తే సహాయ నిరాకరణ చేయాలనే యోచనలో అక్కడి కీలక నేతలున్నారు.
భీష్మిస్తున్న భీమవరం నేతలు
భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు టీడీపీలో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మొన్నటివరకూ తమను ఇబ్బందులు పెట్టిన వారి కోసం ఇప్పుడు ఎలా పనిచేస్తామని కార్యకర్తలు అడుగుతున్న ప్రశ్నలకు నేతల వద్ద సమాధానం లేకుండాపోయింది.
కొత్తవారితో సర్దుకుపోవాలని చంద్రబాబు చెబుతున్న మాటలు వారి చెవికెక్కడంలేదు. దీంతో టీడీపీలో గందరగోళం నెలకొంది. ఇప్పటివరకూ పార్టీని నడిపించిన వారి కోసం పనిచేయాలా, కొత్తగా వచ్చిన బయట నేతల కోసం పనిచేయాలో తెలియక కార్యకర్తలు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ప్రభావం చూపనున్నారు.
టీడీపీలో సెగలు
Published Thu, Mar 20 2014 5:37 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement