కిందకు దించితే తెలుస్తది | kcr takes on kiran kumar reddy | Sakshi
Sakshi News home page

కిందకు దించితే తెలుస్తది

Published Fri, Jan 3 2014 12:18 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

కిందకు దించితే తెలుస్తది - Sakshi

కిందకు దించితే తెలుస్తది

సాక్షి, హైదరాబాద్: ‘‘తండ్రి భుజం మీదకు ఎత్తుకుంటే చంటి పిల్లాడు కూడా ఎత్తు కనబడతడు. మరి ఆ పిల్లాడు.. నీ కన్నా ఎత్తున్నా అని ఎత్తుకున్న తండ్రితోనే అంటే ఎట్లా? భుజాల మీద నుంచి కిందకు దించితే ఆ పిల్లాడి ఎత్తు ఏందో తెలుస్తది...’’ అని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలను ఉద్దేశించి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రపల్లిలోని తన ఫాంహౌజ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)’తో కలుస్తామని జేఏసీ నేతలు అంటున్నారు కదా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఏ జేఏసీ నేతలు’ అని ఎదురు ప్రశ్నించారు. ‘ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు కదా..’ అనడంతో.. కేసీఆర్ కొంచెం ఘాటుగా స్పందించారు. ‘‘తండ్రి భుజం మీదున్న పిల్లగాడు తండ్రి కంటే ఎత్తున్నానని అంటే ఎట్లా? కిందకు దించితే ఆ పిల్లగాని ఎత్తు ఎంతున్నదో తెలుస్తది. ఎవరి స్థాయి ఏందో వారే తెలుసుకుంటే మంచిది. తెలంగాణ విషయంలో అన్నీ నడుస్తున్నాయనుకుని, అదంతా వాళ్ల బలమే అనుకుంటున్నరేమో? ఏం మాట్లాడినా నడుస్తదనుకుంటే తప్పు. ఎవరి శక్తినీ వారు ఎక్కువగా ఊహించుకోవడం మంచిది కాదు. తెలంగాణ కోసం ఏమన్న మాట్లాడితే ఉన్న మద్దతు ఇంకో విషయానికి ఉంటదా? ఉద్యోగులు ఉద్యోగాలు చేయరా?’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
 
 ‘ఆప్’ తెలంగాణలో నడువది: బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాల్లోనే ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ పుంజుకుంటోందని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘ఎక్కడన్నా నాలుగు సీట్లు వస్తాయని బీజేపీ అనుకుంటున్న ప్రాంతాల్లోనే వాటికి గండికొట్టే స్థాయిలో ‘ఆప్’ పెరుగుతున్నట్లు కనబడుతున్నది. ఇది నరేంద్ర మోడీకి దెబ్బే. అయితే అది ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో నడువది. ఇక ‘ఆప్’లో జేపీ చేరితే ఏమైతది. ఆప్‌కు ఏమన్నా ఉంటే ఇలాంటివారి వల్ల ఉన్నది కూడా పోతుంది’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన చేసుకోవడానికి ఇప్పుడే అవకాశమని కేసీఆర్ అన్నారు.
 
 కిరణ్‌ది పైశాచికానందం: రాష్ట్ర విభజనలో అసెంబ్లీ పాత్ర చాలా పరిమితమని కేసీఆర్ స్పష్టం చేశారు. సమైక్య తీర్మానం చేసినా రాష్ట్ర విభజన ఆగదన్నారు. ‘‘దానివల్ల ప్రజల మధ్య ఇంకా వైషమ్యాలు పెరుగుతయి. శాసనసభ వ్యవహారాలను శ్రీధర్‌బాబు నుంచి తొలగించిన సీఎం కిరణ్ కొంత పైశాచికానందం పొందుతున్నడు’’ అని పేర్కొన్నారు. ఇక చంద్రబాబు మైండ్‌సెట్ ఇంకా మారినట్టు లేదన్నారు.
 
 వ్యవసాయంపై సర్కారు నిర్లక్ష్యం
 
 వ్యవసాయ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నదని కేసీఆర్ మండిపడ్డారు. తన ఫాంహౌజ్‌ను, పంటలను ఆయన విలేకరులకు చూపించారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు రంగాలే తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యతలని కేసీఆర్ చెప్పారు. వ్యవసాయాన్ని నామోషీగా భావించొద్దన్నారు.
 
 కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంత గీపెట్టినా 23 వరకే..
 ‘‘తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు కుట్రలు పన్నుతున్నరు. అయినా తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. సీఎం కిరణ్‌ను మించిన ప్లాన్, ఆయన అయ్య జుట్టులోంచి వచ్చిన ప్లాన్ మా వద్ద ఉంది’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం 2014 డైరీని గురువారం ఆయన ఆవిష్కరించారు. మంత్రి కె.జానారెడ్డి, ఎంపీ మధుయాష్కీ హాజరైన ఈ కార్యక్రమంలో కేసీఆర్ ప్రసంగిస్తూ తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగినా, జరగకున్నా ఎలాంటి నష్టం లేదన్నారు. కిరణ్ ఎంత గీపెట్టినా జనవరి 23వరకేనని, ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు కేంద్రం పరిధిలోనికి వెళ్లిపోతుందని చెప్పారు. ‘‘తెలంగాణపై ఏదైనా కిరికిరి చేస్తే యుద్ధానికి సిద్ధం. నేను తెలంగాణ కోసం తల్వార్‌నై పోరాడుతా’’ అని తెలిపారు. టీజీవోల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, స్వామిగౌడ్, మహమూద్ అలీ, దేవీప్రసాద్, విఠల్, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే టీ ఎక్సైజ్ అధికారుల సంఘం డైరీని ఆవిష్కరించారు.
 
 ఎకరంలో పంటకు రూ.80 లక్షలు


 కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో పంటల వివరాలనూ వెల్లడిం చారు. ‘‘మొత్తం 60 ఎకరాల భూమి ఉంది. 50 ఎకరాల్లో నికరంగా పంటలు వేస్తున్నా. అందులో 10 ఎకరాల్లో గ్రీన్‌హౌజులు నిర్మిస్తే మూడు కోట్ల రూపాయలు ఖర్చయినయి. వాటిలో క్యాప్సికం వేసిన. ఆ పంటను చూసిన వ్యవసాయ నిపుణులు కనీసం ఒక హౌజుకు రూ. 80 లక్షల నుండి రూ. 1.2 కోట్లదాకా ఆదాయం వస్తుందని అంటున్నరు. ఎంత తక్కువ వచ్చినా ఒక్క క్యాప్సికం పంటతోనే రూ. 8 కోట్లకు తగ్గకుండా ఆదాయం వస్తది. 40 ఎకరాల్లో ఆలుగడ్డ వేసిన.. దానికి ఎకరానికి 3-6 లక్షల దాకా వస్తుందని అంటున్నరు. ఫాంహౌజ్‌లోనే 60 మంది కూలీలున్నరు. వారి కోసం ఎకరంలో కూరగాయలు, ఐదారెకరాల్లో వరి పండిస్తున్నం. గ్యాస్ కనెక్షన్ కూడా ఇప్పించిన’’ అని కేసీఆర్ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement