అసెంబ్లీలో తీర్మానం ఉండదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజించాలని సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం పార్టీ పరంగా శిలా శాసనమేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తాను కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. అక్టోబర్ 6వ తేదీ లోగా ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. 2014 ఎన్నికల వరకూ కిరణ్‌కుమార్‌రెడ్డే సీఎంగా కొనసాగుతారని చెప్పారు.
రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయిందని, వ్యక్తిగతంగా రాజీనామా చేసినా ప్రయోజనం ఉండదన్నదే తమ అభిమతమన్నారు. అసెంబ్లీలో విభజన అంశంపై తీర్మానం చేయడం ఉండదని, అభిప్రాయాలను మాత్రమే కేంద్రం తెలుసుకుంటుందని చెప్పారు. గాంధీభవన్‌లో సోమవారం విలేకరుల తో మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజిస్తే వచ్చే సమస్యలపై జూలై 12న జరిగిన కోర్‌కమిటీ సమావేశంలో సీఎం 253 పేజీల నివేదికను, తాను 18 పేజీల నోట్‌ను అధిష్టానానికి అందజేశామన్నారు. విభజన వల్ల తలెత్తే పరిస్థితులను వారి ముందుంచుతూ.. ఈ విషయంలో అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తామిద్దరం చెప్పిన మాట వాస్తవమేనన్నారు. అయితే, అంతమాత్రాన తమ ప్రాంత ప్రజల మనోభావాలను చెప్పకుండా ఉండలేమన్నారు. విభజన నిర్ణయం జరిగిపోయిందని, మళ్లీ నిర్ణయాన్ని మార్చాలంటే సీడబ్ల్యూసీ మాత్రమే చేయాల్సి ఉందని బొత్స అన్నారు. అయితే, ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తారని ఎక్కడో చిన్న ఆశ మిగిలి ఉందన్నారు.
కాంగ్రెస్‌తో కుమ్మక్కైనందువల్లే జగన్‌కు బెయిల్ వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలను బొత్స ఖండించారు. ‘ఆ నాడు జగన్‌ను అరెస్టు చేసినప్పుడు సీబీఐ, న్యాయస్థానం చాలా మంచి పనిచేశాయని పొగుడుతారా? ఈ రోజు చట్ట ప్రకారం బెయిల్ వస్తే కాంగ్రెస్ కుమ్ముక్కైందని అంటారా? ఇదేం రాజకీయం’ అని ప్రశ్నించారు. మరోవైపు బొత్స మంగళవారం ఢిల్లీ వెళుతున్నారు. అధిష్టానం బాటలోనే నడవాలనే అంశంపై రెండ్రోజుల్లో సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని బొత్స భావిస్తున్నారు.