
సోనియాగాంధీతో నేడు కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఆదివారం మధ్యాహ్నం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కుటుంబసమేతంగా సమావేశం కానున్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనియాను కలిసినప్పుడు విలీనం అంశం కూడా చర్చకు రావొచ్చని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
టీఆర్‌ఎస్‌ను విలీనం చేయడం లేదా వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు పొత్తులతో ముందుకు వెళ్లడమన్న రెండు అంశాలపై గత కొద్దిరోజులుగా అనేక చర్చలు జరుగుతున్నాయి. ఆదివారంనాటి భేటీ తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే కేసీఆర్ కుటుంబసమేతంగా సోనియాను కలుస్తున్నారని, ఈ సందర్భంగా విలీన అంశంపై చర్చలు ఉండవని టీఆర్‌ఎస్ వర్గాలంటున్నాయి.