మకిలీ... | kharif season in dublicate seeds and farmers prioblems with seeds | Sakshi
Sakshi News home page

మకిలీ...

Published Thu, Jun 19 2014 12:55 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

మకిలీ... - Sakshi

మకిలీ...

సాక్షి, గుంటూరు: ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటికీ వర్షాలు కురవక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, వర్షాలు కురవగానే రైతులు ఆత్రంగా విత్తనాలు కొనుగోలు చేస్తారని గ్రహించి నకిలీ విత్తన వ్యాపారులు తమ పనిలో తాము నిమగ్నమయ్యారు.  నకిలీ విత్తనాల అక్రమ రవాణా వార్తలతో రైతులు బెంబేలెత్తి పోతున్నారు. గతంలో ఓ కంపెనీకి చెందిన నకిలీ మిర్చి విత్తనాలను వేసిన రైతులకు మొక్క ఏపుగా పెరగడం తప్ప పూత, కాయ రాకపోవడంతో తీవ్రంగా నష్టాలపాలయ్యారు. ఈ ఏడాది రాష్ట్ర విభజనకు తోడు, వర్షాలు లేకపోవడంతో నాగార్జున సాగర్ కాలువల ద్వారా సాగు నీరందడం కష్టమేనని భావించిన రైతులు వరి  తగ్గించి వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.
 
ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాల ద్వారా నకిలీ విత్తనాల రవాణా

నకిలీ విత్తనాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేసేందుకు కొందరు అక్రమార్కులు ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాలను అక్రమ రవాణా మార్గాలుగా ఎంచుకుంటున్నారు. ప్రైవేటు వాహనాల్లో తరలిస్తే పోలీసులు, విజిలెన్స్, వ్యవసాయాధికారుల దృష్టి పడుతుందని భావించి ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో నకిలీ విత్తనాలను రవాణా చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని అనేక ప్రాంతాలకు వీటిని చేర్చినట్టు తెలుస్తోంది. బుధవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.

విచిత్రమేమిటంటే నరసరావుపేట, సత్తెనపల్లి, కారంపూడి, దాచేపల్లి వంటి ప్రాంతాల్లో వివిధ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాల్లోనే నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. దీంతో రైతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒక్కరోజు దాడులు నిర్వహిస్తేనే వేల కొద్దీ పత్తి, మిర్చి విత్తనాల ప్యాకెట్‌లు పట్టుబడ్డాయని, ఇంకా గోడౌన్‌లకు ఎన్ని చేరాయోననే భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని గోడౌన్‌లలో తనిఖీలు నిర్వహించాలని వారు కోరుతున్నారు.
 
ఏ ప్రాంతంలో దొరికితే అక్కడి అధికారిపై చర్యలు
నకిలీ విత్తనాలపై తనిఖీలు నిర్వహించకుండా అక్రమార్కులతో కుమ్మక్కై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వ్యవసాయశాఖ అధికారులపై నిఘా ఉంచాం. జిల్లాలో అన్ని మండలాల్లో తనిఖీలు నిర్వహించమని చెప్పినా కొందరు చేయకపోవడంతో గుంటూరు కార్యాలయం నుంచి టీమ్‌లు పంపాం. ఈ దాడుల్లో అనేక ప్రాంతాల్లో నకిలీ విత్తనాలను పట్టుకున్నాం. వ్యవసాయశాఖ కమిషనర్ అనుమతి తీసుకుని ఏ ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు, పురుగుమందులు పట్టుబడతాయో ఆయా పరిధుల్లో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికైనా అధికారులు నకిలీ విత్తనాలపై దృష్టి సారించి తనిఖీలు ముమ్మరం చేయాలి.
 -వల్లూరు శ్రీధర్, వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement