నా కుమారుడు చచ్చినా పర్వాలేదు | kidnapper Ravi Shekhar mother tearful comments about her Son | Sakshi
Sakshi News home page

నా కుమారుడు చచ్చినా పర్వాలేదు

Published Sun, Jul 28 2019 4:41 AM | Last Updated on Sun, Jul 28 2019 4:41 AM

kidnapper Ravi Shekhar mother tearful comments about her Son - Sakshi

దావులూరులోని ఐతం రవిశేఖర్‌ ఇల్లు ( ఇన్‌ సెట్‌లో) ఐతం రవిశేఖర్‌ (ఫైల్‌)

కంకిపాడు (పెనమలూరు): ఎన్నో దుర్మార్గాలు చేస్తున్న తన కుమారుడు రవిశేఖర్‌ చచ్చిపోయినా పర్వాలేదని తల్లి చిట్టిమ్మ కన్నీటి పర్యంతం అయ్యింది. హైదరాబాద్‌ పరిధిలోని హయత్‌నగర్‌లో విద్యార్థిని కిడ్నాప్‌ వ్యవహారంలో ప్రధాన నిందితుడి కోసం పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అతని స్వగ్రామం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరుకు వచ్చారు. రవిశేఖర్‌ కొడుకు రాజాను అదుపులోకి తీసుకుని విజయవాడలోని విచారణ బృందానికి అప్పగించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అతన్ని తల్లి చిట్టమ్మ మీడియాతో మాట్లాడుతూ పెళ్లయిన తరువాత రవిశేఖర్‌ గాడి తప్పాడని చెప్పింది. డబ్బు, బంగారంపై వ్యామోహంతో నేరాలకు పాల్పడ్డాడని చెప్పింది. ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాలేదన్నారు. ఐదేళ్ల క్రితం కోడలు లక్ష్మి చనిపోయిందని, ఆ దినం రోజునే రవిశేఖర్‌ను చూశానని, మళ్లీ చూడలేదని చెప్పింది. తన కొడుకు చచ్చిపోయినా పర్వాలేదని ఆ అమ్మాయి క్షేమంగా ఉండాలని, తల్లిదండ్రుల దగ్గరకు చేరాలని పోలీసు శాఖను కోరింది. పింఛను డబ్బుతో, మనవడి తోడుతో బతుకుతున్నానని, తన మనవడిని విడిపించాలని విలపించింది. 

ఎన్‌కౌంటర్‌ చేసినా బాధపడం: రవి శేఖర్‌ సోదరుడు వెంకటేశ్వరరావు
చిన్నతనం నుంచే ఎన్నో తప్పులు చేశాడని, మందలించినా మార్పు రాలేదని రవిశేఖర్‌ సోదరుడు వెంకటేశ్వరరావు అన్నారు. తప్పు మీద తప్పులు చేస్తున్న రవిశేఖర్‌ను ఎన్‌కౌంటర్‌ చేసినా తాము బాధపడమన్నారు. రాజాను అప్పగించాలని కోరారు. 

రవిశేఖర్‌పై ఎన్నో కేసులు..
ఐతం రవిశేఖర్‌ది కంకిపాడు మండలం దావులూరు. ఇతనిపై ఎన్నో కేసులు ఉన్నాయి. కంకిపాడు పోలీసుస్టేషన్‌ పరిధిలో రెండు చీటింగ్‌ కేసులు, రెండు చోరీ కేసులు, ఒక బైండోవర్‌ కేసు ఉంది. విజయవాడ సిటీ పరిధిలో 12 కేసులు ఉండగా, జిల్లాలో మరో 7 వరకూ కేసులు ఉన్నట్లు పోలీసు శాఖ చెబుతోంది. చిన్న తనం నుంచి తప్పు దోవలో నడుస్తున్న రవిశేఖర్‌ పెళ్లి అయ్యాక బంగారం, డబ్బుపై వ్యామోహం పెంచుకుని దారుణాలకు పాల్పడుతున్నాడని, తమకు తలవంపులు తెస్తున్నాడని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. రవిశేఖర్‌కు, కుటుంబ సభ్యులకు ఐదేళ్లుగా సంబంధాలు లేవని, అలాంటప్పుడు విచారణ కోసం రాజాను అదుపులోకి తీసుకోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement