ఒక్కడు.. అంతులేని నేరాలు | Police Department Arrest Culprit In Rangareddy | Sakshi
Sakshi News home page

ఒక్కడు.. అంతులేని నేరాలు

Published Sun, Aug 4 2019 10:20 AM | Last Updated on Sun, Aug 4 2019 10:20 AM

Police Department Arrest Culprit In Rangareddy - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ 

సాక్షి, నాగోలు: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడి, హయత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విద్యార్థిని కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసిన ఘరానా నేరస్తుడిని రాచకొండ పోలీస్‌లు అరెస్ట్‌ చేశారు.  అతడి వద్ద నుంచి ఒక కారు, రెండు బంగారు ఉంగరాలు, వెండి ఉంగరం, నాలుగు సెల్‌ ఫోన్లు, ఎనిమిది సిమ్‌ కార్డ్‌ లు, రూ.47 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.  శనివారం ఎల్‌బీనగర్‌ సీపీ క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపిన మేరకు.. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం దవలూరుకు చెందిన ఇత్తెం రవి శేఖర్‌ అలియాస్‌ రవి అలియాస్‌ సతీశ్‌  అలియాస్‌ శశిధర్‌రెడ్డి మోసాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. 1994లో వివాహం కాగా 2014 లో భార్య చనిపోయింది. 2011 లో రవిశేఖర్‌ దగ్గరి బంధువుకు ఉయ్యూరు కేసీపీలో ఉద్యోగం పెట్టిస్తానని రూ.30 వేలు నగదు తీసుకుని మోసం చేయగా ఈ కేస్‌లో అరెస్ట్‌ అయి జైల్‌కు వెళ్ళివచ్చాడు. మరో కేస్‌ లో ఓ మహిళను మోసం చేసి జైల్‌కు వెళ్ళి విడుదలయ్యాడు.
 
పలు అధికారులుగా అవతారాలు.. 
జైలు నుంచి వచ్చిన అనంతరం రవి శేఖర్‌ రైస్‌ మిల్లర్స్, రేషన్‌ డీలర్స్, ఫర్టిలైజర్స్‌ షాపుల వద్దకు విజిలెన్స్, ఇన్‌కంటాక్స్‌ అధికారినని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ నని, జడ్జిలు తనకు బంధువులని చెబుతూ డబ్బు తీసుకుని మోసాలకు పాల్పడేవాడు. నిరుద్యోగ యువకులకు కలెక్టర్‌ ఆఫీస్‌ లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ డబ్బు తీసుకుని మొహం చాటేసేవాడు. విశాఖపట్నంలో ఓ మోసపూరిత వ్యవహారంలో మే 23న కాకినాడ కోర్ట్‌ నుంచి విశాఖపట్నం జైల్‌కు తరలిస్తుండగా ఎస్కార్ట్‌ వాహనం నుంచి తప్పించుకుని పారిపోయాడు. అనంతరం జూన్‌లో రైలులో ప్రయాణిస్తున్న క్రమంలో కర్నాటక కొప్పల్‌ జిల్లాకు చెందిన మహిళతో తాను సెక్యూరిటీ ఆఫీసర్‌నని పరిచయం పెంచుకున్నాడు. తన వద్ద రూ.3 కోట్ల మేర డబ్బు వుండగా దాంతో స్థలం కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు నమ్మించి అక్కడి స్థలాలకు చెందిన పత్రాలను, కొంత నగదుతో మరో వ్యక్తితో  ఐ 20 కారు ను తీసుకుని వస్తూ కార్‌ డ్రైవర్‌ను మధ్యలో వదిలి కారుతో సహా ఉడాయించాడు.  

ఆ కారుతో కర్నూలు జిల్లాకు వచ్చి నెంబరు మార్చుకుని తాను గోదావరి జిల్లా సీబీఐ ఆఫీసర్‌ నని చెప్పి నితిన్‌ కుమార్‌ అనే వ్యక్తి వద్ద రూ.50వేలు, ఒక సెల్‌ ఫోన్‌ తీసుకుని పారిపోయాడు.  ఇలా పలు నేరాలు చేశాడు. గత నెల బొంగులూరు గేట్‌ సమీపంలో ఓ విద్యార్థికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బాలికను కిడ్నాప్‌ చేశాడు. అక్కడ నుంచి కడపలో తెలిసిన బంధువులతో జాబ్‌ గురించి మాట్లాడే పని వుందని చెప్పి కడప, కర్నూల్, ప్రకాశం జిల్లాల్లో ఆ విద్యార్థిని తిప్పుతూ ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. వాడపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈనెల 28 న బాధితురాలిని కారులోనే బంధించి ఆ వాహనం నెంబర్‌ను తిరిగి మార్చి ఎరువుల దుకాణం వద్దకు వెళ్ళి తాను విజిలెన్స్‌ అధికారినని బెదిరించి వారి నుంచి రూ.82 వేల నగదు, బంగారం, వెండి వుంగరాలు తీసుకుని పరారయ్యాడు.

అప్పటికే హయత్‌ నగర్‌  పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో గత నెల 30న కిడ్నాప్‌ చేసిన విద్యార్థిని హైదరాబాద్‌ బస్‌ ఎక్కించి ‘నువు వెళ్ళిపో.. నేను నీ వెనక వచ్చేస్తా..’ నని చెప్పి అక్కడ నుంచి ఉదాయించాడు. పోలీసులు జీపీఆర్‌ సిస్టమ్‌ ద్వారా రవి శేఖర్‌ ను పంతంగి టోల్‌ గేట్‌ వద్ద అరెస్ట్‌ చేసి అతడి నుంచి కారు, నగదు, బంగా రం స్వాధీనం చేసుకుని విచారించగా ఇతడిపై తెలంగాణలో 10 కేస్‌లు, ఆంధ్రప్రదేశ్‌లో 38 కేస్‌ లు, కర్నాటకలో 1 కేస్‌లు నమోదైనట్లు గుర్తించారు. రవిశేఖర్‌ ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ధారాళంగా మాట్లాడుతూ మోసాలకు పాల్పడటంలో దిట్ట అని పేర్కొన్నారు. రాచకొండ జాయింట్‌ సీపీ సుధీర్‌ బాబు, ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఎస్‌ఓటీ అడిషనల్‌ డీసీపీ సురేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement