బంతి బంతికో లెక్క...జీవితమే పణంగా | Kills Cricket Betting | Sakshi
Sakshi News home page

బంతి బంతికో లెక్క...జీవితమే పణంగా

Published Thu, May 19 2016 1:20 AM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM

బంతి బంతికో లెక్క...జీవితమే పణంగా

బంతి బంతికో లెక్క...జీవితమే పణంగా

నగరం, జిల్లాలో ప్రాణాలు తీస్తున్న క్రికెట్ బెట్టింగ్‌లు
ఈ ఐపీఎల్ సీజన్‌లో ముగ్గురు ఆత్మహత్య!
నగరంలో ద్వితీయ, రూరల్‌లో తృతీయ శ్రేణి బుకీలు
ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో ప్రధాన సూత్రధారులు
రెస్టారెంట్లలో లైవ్ బెట్టింగ్‌లపై సాధారణ కేసులు

 

భారతీయులకు క్రికెట్ అంటే ఆట మాత్రమే కాదు.. అదో మతం. క్రికెట్టే శ్వాసగా లక్షలాది మంది టీవీలకు అతుక్కుపోయి గడిపేస్తుంటారు. ఈ బలహీనతనే సాంకేతికత సాయంతో కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. క్రికెట్ ప్రేమికులకు బుకీలు ఎరవేసి బెట్టింగ్ ఉచ్చులోకి దింపుతున్నారు. ఫలితంగా ఎందరో అమాయక ప్రజలు లక్షలాది రూపాయలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. వీరిలో విద్యావంతులు, యువతే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. పైసా ఖర్చు లేకుండా కేవలం చిన్న గదిలో కూర్చుని బెట్టింగ్‌లకు పాల్పడే బుకీలు మన విశాఖలోనూఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. కానీ ఇది వాస్తవమని కొన్నేళ్ల క్రితమే బయటపడింది. విశాఖ కేంద్రంగా బుకింగ్‌లకు పాల్పడుతున్న ఓ బుకీని పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. అప్పట్లో అది ఓ సంచలనం. అయితే ఆ తర్వాత అతను సిటీ నుంచి నగర శివారుకు మకాం మార్చాడు. అక్కడి నుంచే తన నెట్‌వర్క్‌ను నడుపుతున్నాడు.  - సాక్షి, విశాఖపట్నం

 

హుషారెత్తించే టీ20 మ్యాచ్ ఎక్కడ జరిగినా అందరూ ఎంతో ఉత్సాహంగా చూస్తారు. ఐపీఎల్ ప్రారంభమై తొమ్మిదేళ్లు గడిచినా క్రికెట్ ప్రేమికుల్లో ఆసక్తి మాత్రం తగ్గలేదు. రోజురోజుకూ ఐపీఎల్ చూసేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లోనూ ప్రతీ జట్టూ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే... ఇంకోవైపు మాత్రం కోట్ల రూపాయలు కొల్లగొట్టే బెట్టింగులకు వేదికగా మారడం మాత్రం విచారకరం. ఐపీఎల్‌తోపాటు వరల్డ్ కప్, ఇండియా-పాకిస్తాన్, ఇండియా-ఆస్ట్రేలియా... ఇలా కొన్ని ముఖ్యమైన, పెద్ద జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ల సమయంలో బుకీలకు పండుగే పండుగ.

 
మాదకద్రవ్యాలకు మించిన మత్తు

ఒకప్పుడు వన్డేలు, వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరిగినప్పుడు మాత్రమే జరిగే బెట్టింగ్‌లు ఐపీఎల్ రంగప్రవేశంతో విస్తృతమయ్యాయి. నగరాల నుంచి పట్టణాలు, పల్లెలకూ ఈ జాఢ్యం విస్తరించింది. ఈ నేపథ్యంలో సంపన్నులే కాకుండా మధ్యతరగతి, రోజువారీ కూలీలు కూడా పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే మత్తు పదార్థాలకు మించిన రీతిలో బెట్టింగ్‌లకు బానిసలైపోతున్నారు. నగరానికి చెందిన కొందరు బుకీలు యువతను టార్గెట్ చేసుకుని బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. కొందరు విశాఖ నగరంలోనే హోటళ్లు, లాడ్జీలు అద్దెకు తీసుకుని బెట్టింగ్‌లు నడుపుతుంటే... మరికొందరు రూరల్ ప్రాంతాలకు వెళ్లి అక్కడి నుంచి ఏజెన్సీ, గ్రామీణుల చేత బెట్టింగ్ లు వేయిస్తున్నారు. మరి కొందరు ఇటు విజయనగరం, అటు రాజమండ్రి ప్రాంతాల్లో ఉంటూ విశాఖలో బెట్టింగ్‌లు నడిపిస్తున్నారు. వీరి ఉచ్చులో పడి బెట్టింగ్‌లు కట్టి సొమ్ములు కోల్పోయి అప్పుల పాలై తాజా ఐపీఎల్ సీజన్‌లో అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం ప్రాంతాలకు చెందిన ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయితే విషయం బయటకు తెలిస్తే పరువుపోతుంద ని వారి కుటుంబ సభ్యులు విషయాన్ని గుట్టుగా ఉంచారు. ఇలా చాలా మంది బయటకు చెప్పుకోలేక, పోలీసులను ఆశ్రయించలేక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

 
ఈ ఐపీఎల్‌లో రూ.5 కోట్ల వ్యాపారం

మూడంచెల విధానంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బెట్టింగ్‌లు జరుపుతున్న బుకీలు సబ్బవరం, రణస్థలం నుంచి ఎక్కువగా ఆపరేట్ చేస్తున్నట్లు మొబైల్ సిగ్నల్స్‌ను బట్టి పోలీసులకు తెలుస్తోంది. అయితే ఇటు అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం వంటి రూరల్ ప్రాంతాల్లో తృతీయ శ్రేణి బుకీలు గ్రామీణ యువతను ఆకర్షిస్తున్నారు. విశాఖ కేంద్రంగా ద్వితీయ శ్రేణి బుకీలు బెట్టింగ్‌లు నడిపిస్తుండగా ప్రధాన సూత్రధారులు హైదరాబాద్, ముంబై నగరాల నుంచి చక్కబెడుతున్నారు. ఐపీఎల్ వరకూ ఒక్క విశాఖ కేంద్రంగానే కనీసం రూ.5కోట్ల మేర వ్యాపారం జరుగుతోందని అంచనావేస్తున్నారు. స్థానికంగా పలు రెస్టారెంట్లు బెట్టింగ్‌లను నిర్వహిస్తున్నాయి. స్కీన్‌పై లైవ్ మ్యాచ్‌ను చూస్తూ బెట్టింగ్ జరిపే విధానాన్ని వీరు అనుసరించి స్థానిక యువతను దీనిలోకి దింపుతున్నారు. అయితే ఇలాంటి కొందరిని పోలీసులు పట్టుకున్నారు. కానీ వీరిపై కేవలం గేమింగ్ యాక్ట్ ప్రకారమే కేసు నమోదు చేస్తున్నారు. 

 

సమిధలవుతున్న బతుకులు
సరదాగా మొదలైన బెట్టింగ్ రానురానూ వ్యసనంగా మారిపోతోంది. కొంతమంది అదృష్టం బాగుంటే కూర్చుని రూ.లక్షలు సంపాదించవచ్చనే ఆశతో ఇదే లోకంగా గడిపేస్తున్నారు. దీంతో తెలియకుండా ఈ ఊబిలో కూరుకుపోతున్నారు. చేతిలో ఉన్న నగదు, బంగారం... ఇలా స ర్వం కోల్పోయాక కూడా అప్పులు చేసి బెట్టింగ్‌లు కడుతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక కుటుంబానికి భారమై ఆత్మహత్యలకు సిద్ధమవుతున్నారు.

 

మారిన పందేల తీరు
సాధారణంగా క్రికెట్ పందేలు పేకాట తరహాలో సమాన నగదుతోనే జరిగేవి. టీ20 రాకతో వాటి స్వరూపమే మారిపోయింది. ఆడే జట్ల బలాల ఆధారంగా రూపాయికి 80 పైసలు, రెండు రూపాయలు... ఇలా కొత్త ఆఫర్లు రూపొందించారు. మ్యాచ్ ఎవరు గెలుస్తారనేది మాత్రమే కాకుండా ఒక జట్టు ఎన్ని పరుగులు చేస్తుంది. ఎన్ని వికెట్లు పడగొడుతుంది. స్టార్ ఆటగాడు ఎన్ని పరుగులు చేస్తాడు... ఈ తరహాలో రకరకాలుగా పందేలు సాగుతున్నాయి. ఈ తతంగమంతా అరచేతిలో చరవాణి ద్వారానే సాగిపోతోంది. టాస్ వేసినప్పటి నుంచి బంతి బంతికీ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ప్రధాన నగరాల్లో ఉండే పెద్ద పెద్ద బుకీలు తమ ఏజెంట్ల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉన్నవారు చరవాణి ద్వారా కార్యకలాపాలు సాగిస్తూ పోలీసులకు అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement