
కిరణ్, బొత్సకు నెల ముందే తెలుసు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు నెలరోజుల ముందే రాష్ట్ర విభజన నిర్ణయం తెలుసునని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. అయినప్పటికీ సీమాంధ్రలో ఉనికిని చాటుకునేందుకు తనకేమీ తెలియదంటూ సీఎం డ్రామాలాడుతున్నారని విమర్శించారు.సీఎల్పీ కార్యాలయంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పి.నర్సారెడ్డి, ఎమ్మెల్సీలు కె.ఆర్.ఆమోస్, కె.యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.ఇంద్రసేనారెడ్డిలతో కలిసి పాల్వాయి మీడియాతో మాట్లాడారు. ‘విభజన గురించి నాకు తెలియదని, విభజన వల్ల అనేక సమస్యలు వస్తాయని సీఎం చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలు. హైకమాండ్ నిర్ణయం వెలువడటానికి నెలరోజుల ముందు నుంచే విభజన సంగతి సీఎంకు తెలుసు. సీఎంతోపాటు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహలను విశ్వాసంలోకి తీసుకుని విషయం చెప్పారు. కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశానికి పిలిచి, విభజనపై మాట్లాడారు.
ఆ తరువాత కూడా మరోసారి వారితో సమావేశమయ్యారు. మాకేమీ తెలియదని ఇప్పుడు చెబితే ఎట్లా?’’అని ప్రశ్నించారు. చంద్రబాబు సైతం విభజనపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని చెప్పడం విడ్డూరమన్నారు. విభజనకు అనుకూలమని, రాష్ట్రాన్ని విభజించాలని చంద్రబాబు లేఖ ఇచ్చినప్పుడే తెలంగాణపై పెద్ద ఇబ్బంది తొలగిపోయిందన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు జరిగే చర్చ సందర్భంగా విభజనవల్ల తలెత్తే సమస్యలపై మాట్లాడేందుకు టీడీపీ సహా అన్ని పార్టీలను భాగస్వాములను చేస్తారని చెప్పారు. రాష్ట్ర విభజనపై సోనియాగాంధీ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా విభజన ఆగదన్నారు. రాజధాని ఉన్న రాష్ట్రమెప్పుడూ విభజన కోరుకోలేదంటూ సీమాంధ్ర నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘షిల్లాంగ్ రాజధానిగా ఉన్న అస్సాం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. సొంత రాజధానిని ఏర్పాటు చేసుకుంది.
అలాగే మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలు కూడా విడిపోయాయి. కొత్తగా రాష్ట్రం ఏర్పడితే భవిష్యత్ ప్రణాళికతో రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చు’ అని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులు భయపడాల్సిన అవసరం లేదని, గ్రేటర్ హైదరాబాద్‌లో శాంతిభద్రతల వ్యవహారం కేంద్రం పరిధిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తాము హైకమాండ్‌ను కోరామన్నారు. తెలంగాణపై పార్టీ మాత్రమే నిర్ణయం తీసుకుందంటూ సీఎం ప్రజలను మోసం చేస్తున్నారని యాదవరెడ్డి విమర్శించారు. ‘కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్సే. అధికార పార్టీ ఆదేశానుసారమే కేంద్రం నడుస్తుంది. ఈ విషయం తెలిసి కూడా ప్రజలను మోసం చేస్తున్న సీఎంను ప్రజలు క్షమించరు’’అని దుయ్యబట్టారు. హైకమాండ్ ప్రతిష్టను దెబ్బతీస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉండాలో లేదో తేల్చుకోవాలని ఆమోస్ అన్నారు.