కిరణ్ కుమార్ రెడ్డి ఓ ఫెయిల్యూర్ సీఎం: దినేష్ రెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ డీజీపీ దినేష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి తన సోదరుడు సంతోష్ రెడ్డి భూకబ్జాలను అడ్డుకోవటంతో తనను టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు. కిరణ్ సోదరుడి భూకబ్జాలను ఆపినందుకే తనపై కక్ష కట్టారని దినేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా ఎస్పీ శ్యాంసుందర్ విషయంలో ముఖ్యమంత్రి చెప్పినట్లు నడుచుకోనందునే తనను డీజీపీగా కొనసాగించలేదని ఆయన అన్నారు. శ్యాంసుందర్ ను సస్పెండ్ చేయమని తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
తన పదవీ కాలాన్ని పదవికాలాన్ని పొడిగిస్తానని చెప్పి.. ఆ తర్వాత నమ్మక ద్రోహం చేశారని దినేష్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రిపై న్యాయపోరాటం చేస్తానని దినేష్ రెడ్డి తెలిపారు. అవసరం అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు.
అధికారంలో ఉన్న సీఎంపై ఆరోపణలు చేస్తున్న మీపై చర్యలు తీసుకుంటే ఎలా అనే ప్రశ్నకు .. అధికారం బాప్ కా జాగీర్ కాదు.. తనకు ఉండే మద్దతు తనకు ఉందని.. తన ప్రణాళిక తనకు ఉంది అని దినేష్ రెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. అంతే కాకుండా కిరణ్ కుమార్ రెడ్డి ఓ ఫెయిల్యూర్ సీఎం అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్లు బలపడుతారనేది ఊహాజనితమేనని ఆయన అన్నారు. తన వెనుక రాజకీయ నేతల ఒత్తిడి లేదని అన్నారు. సీఎం ఒత్తిడితోనే సీమాంధ్ర ఉద్యోగుల సభకు అనుమతి ఇచ్చానన్నారు. సీఎంపై చర్యలు తీసుకునే వారు తీసుకుంటారని వ్యాఖ్యలు చేశారు.
సీమాంధ్రలో ఉద్యమాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయన్నారు. తను రాజకీయాల్లో ప్రవేశించాలనే ఆసక్తి లేదని దినేష్ రెడ్డి మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం మీ వెనక ఉండి నడిపిస్తుందా అని అడిగిన ప్రశ్నకు .. తనక జరిగిన అన్యాయానికి, వెన్నుపోటుకు మాత్రమే స్పందిస్తున్నాను అని అన్నారు.
కాగా తన పదవీ కాలం పొడిగించాలంటూ దినేష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఆయన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.