ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినన్న విషయం మరిచి, కేవలం 13 జిల్లాలకే పరిమితమైనట్లుగా వ్యవహరిస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వైఖరి సిగ్గు చేటని టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి విమర్శించారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న సకల జనభేరి సదస్సుకు పెద్ద ఎత్తున తెలంగాణవాదులు తరలివచ్చి మరోసారి ఉద్యమ సత్తాచాటాలన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమంతో జూలై 30న సీడబ్ల్యూసీ తెలంగాణ ప్రకటించిందని, దీన్ని అడ్డుకునేందుకు సీఎం కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం వారం రోజులపాటు నోరుమెదపని సీఎం ఇప్పుడు తెలంగాణ అంశంపై విషం కక్కారన్నారు.
జలయుద్ధాలు జరుగుతాయని లేనిపోని తప్పుడు ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి స్వయంగా సమైక్య వాదినని చెప్పుకుంటున్నా ఇంకా తెలంగాణ మంత్రులకు సిగ్గు రావడం లేదన్నారు. వెంటనే వారి పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. తెలంగాణలో తాము బస్సు యాత్ర చేపడుతామని ఎర్రబల్లి దయాకర్‌రావు మాట్లాడడం అవివేకమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమైక్యాంధ్ర కోసం బస్సు యాత్ర చేపట్టి సీమాంధ్ర ఉద్యమానికి వత్తాసు పలికినా ఈ ప్రాంత టీడీపీ నాయకులకు సిగ్గులేదన్నారు. తెలంగాణపై చిత్త శుద్ధి ఉంటే వెంటనే రాజీనామాలు చేయాలని కోరారు. టీఆర్‌ఎస్ నాయకులు బాదం గంగన్న, సయ్యద్‌సుజాత్‌అలీ, మహేందర్, ముజాషిద్‌షా ఉన్నారు.
సీఎం వైఖరి సిగ్గు చేటు : లోక భూమారెడ్డి
Published Sun, Sep 29 2013 4:19 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement