‘విభజన’పై సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంలో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చే నెల 23 వరకు వ్యూహాత్మక మౌనం పాటించాలని భావిస్తున్నారు. తనను కలిసేందుకు వస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు కూడా ఆయన ఇదే రకమైన సలహా ఇస్తున్నారు. సోమవారం ఎంపీలు ఉండవల్లి, అనంత, హర్షకుమార్, మాగుంట, ఎమ్మెల్యేలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, శ్రీధర్ కృష్ణారెడ్డి తదితరులు సీఎంను విడివిడిగా కలిశారు. అయితే, వారు వివిధ వ్యక్తిగత పనుల నిమిత్తం సీఎంను కలిసినప్పటికీ విభజన విషయంలో కేంద్రం దూకుడుగా వెళుతున్నందున.. భవిష్యత్ కార్యాచరణ ఏమిటనే దానిపై చర్చ జరిగింది.
పలువురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడటానికి సిద్ధంగా ఉన్నారని.. తమ భవిష్యత్ ఏమిటో అర్థం కావడం లేదని వారిలో కొందరు నేతలు సీఎం ఎదుట వాపోయారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో ఉండలేమనే భావనను కూడా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం ‘‘23 వరకూ ఓపిక పట్టండి. ఆ తరువాత అందరం కలిసి రాజకీయ భవిష్యత్‌పై సమష్టి నిర్ణయం తీసుకుందాం’’ అని చెప్పినట్లు తెలిసింది. సీఎంను కలిసిన అనంతరం ఎమ్మెల్యే ఒకరు మాట్లాడుతూ.. సీఎం మాటలు నమ్మాలో.. వద్దో? అర్థం కాకుండా ఉందని వ్యాఖ్యానించారు. అలాగే హైకమాండ్ తీరును తప్పుపడుతున్న సీఎం ఇంకా మొండిగానే ఉన్నారని, ఆయన మాటలను చూస్తుంటే కొత్త పార్టీ పెడతారేమోననే భావన కలుగుతోందని ఓ ఎంపీ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి టీజీ కూడా సోమవారం సచివాలయంలో సీఎం కిరణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతానికి పార్టీ వీడే ఆలోచన లేదని, అయితే రాష్ట్ర విభజనను అడ్డుకోలేకపోతే దీనిపై ఆలోచిస్తానని బదులిచ్చారు.