తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఇందిర, రాజీవ్‌ల విగ్రహాలను ఎవరూ ముట్టుకోలేదని, సమైక్యాంధ్ర ఉద్యమంలో మాత్రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే ముందుండి వారి విగ్రహాలను ధ్వంసం చేయిస్తున్నారని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి పేర్కొన్నారు.
నిజామాబాద్, న్యూస్‌లైన్ : తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఇందిర, రాజీవ్‌ల విగ్రహాలను ఎవరూ ముట్టుకోలేదని, సమైక్యాంధ్ర ఉద్యమంలో మాత్రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే ముందుండి వారి విగ్రహాలను ధ్వంసం చేయిస్తున్నారని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి పేర్కొన్నారు. ఈ విషయం తెలిసి కూడా సీఎం, డీజీపీల వైఖరిపై టి.కాంగ్రెస్ మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లో టీ విద్యార్థి జేఏసీ నిర్వహించే మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేయాలని కోరుతూ నిర్వహించే యాత్రను సోమవారం నిజామాబాద్ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యమానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారన్నారు. సీమాంధ్ర పాలకుల నాటకాలు, దాడులు ఆపాలని హెచ్చరించారు. 7న జరిగే సీమాంధ్రుల సభకు అనుమతిస్తే, అదే రోజున తెలంగాణ మిలియన్ మార్చ్‌కూ అనుమతినివ్వాలన్నారు. అనుమతి ఇవ్వకపోయినా మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేసి తీరుతామన్నారు. బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు తెలంగాణకు ద్రోహం చేస్తూ, సీమాంధ్ర ఉద్యమానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.