సున్నా కాదు..నేనున్నా
సున్నా కాదు..నేనున్నా
Published Tue, Jan 7 2014 2:47 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
సాక్షి, రాజమండ్రి :‘ముందుంది మరింత మంచి కాలం..’ ఇది ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తన ప్రభుత్వ ఘనతను చాటుకునే ప్రచారంలో వినియోగిస్తున్న నినాదం. ఇదే మాట ను ఇప్పుడాయన కాంగ్రెస్‌లోని తన వర్గీయులకు వినిపిస్తున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో ప్రజల కన్నెర్రకు గురైన కాంగ్రెస్‌లో ఉంటే రాజకీయ భవిష్యత్తు సున్నేనని ఆ పార్టీ నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో తరుణోపాయాలను అన్వేషిస్తున్నారు. ఇతర పార్టీల వైపు చూపు సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో తనకు అనుకూలురని నమ్ముతున్న వారు సైతం ‘చెట్టుకొకరు.. పుట్టకొకరు’ అన్నట్టు
చెల్లాచెదురవకుండా తనతో అట్టిపెట్టుకోవాలని కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరాటపడుతున్నారు. కొత్త గూటి కోసం వెతుకుతున్న వారిని బుజ్జగిస్తున్నారు.
అవసరమైతే కొత్త పార్టీ పెట్టుకుందామని భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జిల్లాలోని మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరికి స్వయంగా, మరికొందరికి తన కార్యాలయ వర్గాల ద్వారా ఫోన్‌లు చేస్తున్నట్టు తెలుస్తోంది. కొంత కాలంగా జిల్లాలో కాంగ్రెస్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు తాము పార్టీ మారుతున్న సంకేతాలను పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతో పాటు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికీ పంపారు. ఇప్పటికే కొందరు పార్టీ మారిపోగా మరికొందరు కూడా ఇదే బాటలో ఉండడంతో జిల్లాలో కాంగ్రెస్ కుదేలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలకు సంబంధించి రాష్ట్రస్థాయిలోనే సెంటిమెంట్ జిల్లాగా పరిగణన పొందిన తూర్పు గోదావరిలో వైఎస్సార్ కాంగ్రెస్ బలంగా ఉండడం, పూర్వ వైభవం కోసం తెలుగుదేశం పావులు కదుపుతుండడంతో తన వారు అనుకున్న వారు తనతోనే ఉండేలా ఒప్పించడానికి కిరణ్ ముప్పుతిప్పలు పడుతున్నట్టు తెలుస్తోంది.
ఫోన్‌లు చేసిన సందర్భంగా స్థానిక నేతలు ‘జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి బాగా బలహీన పడిపోయింది’ అని వివరించే ప్రయత్నం చేయగా, ‘తొందర పడవద్దు. ఇది కాకపోతే కొత్త పార్టీ ద్వారానైనా ప్రజల్లోకి వెళదాం’ అంటూ అనునయిస్తున్నట్టు తెలుస్తోంది. కిరణ్‌కుమార్‌రెడ్డి ముందుగా రాష్ట్ర విభజన అంశాన్ని తనకు కలిసి వచ్చేలా మలచుకుని, తర్వాత కొత్త పార్టీ పెడతారన్న అంచనాలు.. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌ను వీడి వెళ్లాలనుకుంటున్న వారిని సందిగ్ధంలోకి నెట్టాయంటున్నారు. అయితే కిరణ్ భరోసా ఇస్తున్నట్టు ‘ముందున్నది మంచి కాలమా, ఁముంచురూ. కాలమా?’ అన్న శంక కూడా పలువురిని పట్టి పీడిస్తోంది. ‘విభజన’ అనే గునపంతో రాజకీయంగా తన సమాధి తానే తవ్వుకుంటున్న కాంగ్రెస్ నీడ.. తాము ఎక్కడికి వెళ్లినా దెయ్యంలా వెంటపడి మట్టి కరిపిస్తుందన్న భీతి వారిని వీడడం లేదు.
‘చేతి’కి చెల్లుచీటీ ఖాయం..
కాగా జిల్లాలో పలువురు కాంగ్రెస్ నాయకులు ఏ కొత్త గూటికి చేరాలో ఇంకా నిర్ణయించుకోకపోయినా.. ఉన్న పార్టీని వీడాలని నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ రాజకీయ వైరాగ్యం ప్రకటించి, కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా తాను ఏ పార్టీ వంకా చూడనని తేల్చి చెప్పారు. దీంతో ఆయన అనుయాయుడైన నగర ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు కూడా పార్టీని వీడేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. మరో ప్రధాన నేత ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం కూడా ఇదే బాటలో ఉన్నారు. మరో వంక మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారని తెలుస్తోంది. జిల్లాలో ఇతర ముఖ్యనేతలు కూడా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉండడంతో సీఎం తన వర్గాన్ని బుజ్జగించే పనిలో ఉన్నారు. ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ఏ పార్టీలోనైనా సీటు సంపాదించాలని చూస్తున్న పలువురు వ్యాపారవేత్తలకు కూడా..పనిలో పనిగా సీఎం నుంచి ఫోన్లు వచ్చినట్టు సమాచారం.
Advertisement
Advertisement