సాక్షి, హైదరాబాద్: కొత్త పార్టీ ఏర్పాటు అంశంపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు, రాష్ట్ర నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి, ఇతర నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ కొత్త పార్టీ అంశాన్ని నేరుగా ప్రస్తావించనప్పటికీ.. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో ఉద్యోగుల పరిరక్షణకోసం ఉద్యమించాలని సంఘం నేతలకు సూచించడంతోపాటు తాను సైతం ఇందుకోసం పోరాడతానని పేర్కొన్నట్లు తెలిసింది. విభజన జరిగినందున సీమాంధ్రలో కొత్త పార్టీ పెట్టేందుకున్న అవకాశాలు, దాని ఫలితాలపై ఎన్జీవో నేతలనుంచి ఆరా తీసినట్టు సమాచారం. సమావేశానంతరం అశోక్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. సీఎంతో భేటీలో కొత్త పార్టీ అంశం ప్రస్తావనకు రాలేదన్నారు. ఒకవేళ కొత్త పార్టీ పెడతానని చెబితే ఉద్యోగ సంఘం నాయకులతో సమావేశమై తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
కిరణ్‌తో పలువురు నేతల భేటీ: మంత్రులు పితాని సత్యనారాయణ, శైలజానాథ్, ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, సబ్బంహరి, సాయిప్రతాప్, హర్షకుమార్‌లతో అంతకుముందు కిరణ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం ఒకటి, రెండ్రోజుల్లో తేలే అవకాశమున్నందున.. ఆ తరువాతే కొత్త పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని ఈ సం దర్భంగా భావించినట్లు తెలిసింది. కాగా మహాశివరాత్రి రోజున ప్రకటన చేసే దిశగా ఆలోచనలు సాగుతున్నట్టు సమాచారం.