వెలుగునిచ్చిన ‘కిరణాని’కే.. వెన్ను చూపారు!
కిరణ్‌కు చెయ్యిచ్చిన జిల్లా కాంగ్రెస్
చేరదీసి మంత్రిని చేస్తే ఎదురుతిరిగిన కోండ్రు
చివరి నిముషంలో జారుకున్న శత్రుచర్ల
ముఖం చాటేసిన సత్యవతి, సుగ్రీవులు, నీలకంఠం
ఎమ్మెల్యే కొర్ల భారతి ఒక్కరే బాసట
ఈ తరుణంలో పార్టీ పెట్టినా దాని ఉనికే ప్రశ్నార్థకం
అధికార ‘కిరణా’ల వెలుగు కోసం ఇన్నాళ్లూ అర్రులు చాచినవారు.. ఆ కిరణాల వెలుగులో అధికారభోగం అనుభవించిన వారు.. ఇప్పుడు కిరణాలు అస్తమించే వేళ.. ఇంకా వాటి నీడలోనే ఉంటే తమ భవిష్యత్తూ మసకబారుతుందన్న భయంతో దూరంగా పారిపోయారు. ఇన్నాళ్లూ అధికార కేంద్రాన్ని అంటిపెట్టుకొని.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్న ప్రజాప్రతినిధులు. నమ్ముకున్న నేతకు అధికారాంతమున చెయ్యిచ్చి.. ఎంచక్కా పక్కకు తప్పుకొన్నారు. సీఎం పదవికి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డికి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు అనూహ్యంగా షాక్ ఇచ్చి రాజకీయమంటే.. ఇదే సుమా! అని చేతల్లో చూపెట్టారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి జిల్లా కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా’.. అన్నట్లు అధికారాంతమున ఆయనకు చెయ్యిచ్చింది. నిన్నటి వరకు ఆయన ప్రాపకం కోసం ప్రాధేయపడ్డ నేతలు ఒక్కసారిగా ముఖం చాటేశారు. ప్రాధేయపడి మరీ మంత్రి పదవి పొందిన కోండ్రు మురళి కొన్ని రోజుల ముందే కాడి వదిలేసి.. కిరణ్‌పైనే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరో మంత్రి శత్రుచర్ల క్లైమాక్స్‌కు ముందు జారుకున్నారు. ఎమ్మెల్యేలు సత్యవతి, సుగ్రీవులు, నీలకంఠం అసలు పత్తా లేకుండా పోయారు. రాజకీయంగా ఏమాత్రం ప్రభావం చూపించలేని కొర్ల భారతి మాత్రమే కిరణ్ వర్గంలో కనిపించారు.
వెన్నంటి నిలిచేవారేరీ!
‘సీఎంగారు మా జిల్లాకు రండి.. మా నియోజకవర్గంలో పర్యటించండి’ అని కిరణ్‌కుమార్‌రెడ్డిని ఒకప్పుడు ప్రాధేయపడిన జిల్లా కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. ఆయన సీఎం పదవి చెపట్టిన తరువాత తొలిసారి రచ్చబండ కార్యక్రమాన్ని జిల్లాలోనే చేపట్టారు. అనంతరం జిల్లాకు మూడు రోజుల చొప్పున సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించి, దాన్ని కూడా జిల్లా నుంచే ప్రారంభించారు. ఈ కార్యక్రమంతోపాటు రాజధానిలోనూ ఆయన్ను అంటిపెట్టుకొని తిరిగి పదవులు, పనులు పొందిన నేతలు ఆయన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడంతో తమ అసలు రంగు చూపించారు. పదవిలో ఉన్నంతకాలం విభజనకు పరోక్షంగా సహకరించిన కిరణ్, రాజీనామా అనంతరం సొంత కుంపటి పెట్టుకోవాలని భావించారు. కానీ జిల్లా కాంగ్రెస్ నుంచి ఆయనకు ఏమాత్రం సానుకూలత వ్యక్తం కాలేదు.
కోండ్రు ఫైర్
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాపకంతోనే మంత్రి అయిన కోండ్రు మురళి మరోసారి తన అసలు రంగు బయటపెట్టారు. కిరణ్ అధికారాన్ని కోల్పోతున్నారని తెలియగానే తన నిజస్వరూపం చూపించారు. కిరణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడి ముందుగానే జారుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
జిల్లాలో ఆయనే మొదటి నుంచి కిరణ్ వర్గీయుడిగా గుర్తింపు పొందారు. తను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పట్టుబట్టి కిరణ్‌ను తన నియోజకవర్గానికి రప్పించారు. సీఎం హోదాలో కిరణ్ తొలి రచ్చబండ కార్యక్రమాన్ని తన రాజాం నియోజకవర్గంలోనే నిర్వహించారు. అనంతరం కూడా సదా కిరణ్ వెన్నంటి ఉంటూ కనిపించారు. ఆయన్ను ప్రాధేయపడి మరీ మంత్రి పదవి సాధించారు. తీరా ఇప్పుడు తానేమిటో చూపించారు. కిరణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
క్లైమాక్స్‌కు ముందు జారుకున్న శత్రుచర్ల
కిరణ్ నుంచి అత్యంత గౌరవం పొందిన మంత్రి శత్రుచర్ల కూడా చివరి నిముషంలో ఆయనకు చెయ్యిచ్చారు. రెండు రోజుల క్రితం వరకు కిరణ్ నిర్వహించిన ఆంతరంగిక సమావేశాల్లో శత్రుచర్ల కనిపించారు. విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యేగా ఉన్న తన మేనల్లుడు జనార్దన్ థాట్రాజ్‌తో ఆయన కిరణ్‌తో చర్చల్లో పాల్నొన్నారు. ‘ఇంజిన్ ఎటు వెళితే బోగీలూ అటే’ అని వ్యాఖ్యానించడం ద్వారా తాను కిరణ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడతాననే సంకేతాలు ఇచ్చారు. కానీ కథ క్లైమాక్స్‌కు వచ్చేసరికి ముఖం చాటేశారు. కీలక సమయంలో హైదరాబాద్‌లో ఉండకుండా విజయనగరంలోని తన స్వస్థలానికి వెళ్లిపోయారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చెప్పుకొచ్చారు.
ముఖం చాటేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేలు బొడ్డేపల్లి సత్యవతి, నిమ్మక సుగ్రీవులు, మీసాల నీలకంఠం సైతం కీలక సమయంలో కిరణ్‌కు ముఖం చాటేశారు. ఆయన వెన్నంటి నిలవలేమని తేల్చి చెప్పేశారు. కిరణ్ వర్గీయులు చేసిన ఫోన్లకు కూడా వారు స్పందించలేదని తెలుస్తోంది. కాంగ్రెస్‌లోనే కొనసాగాలని వారు నిర్ణయించుకున్నారు.
భారతి వెన్నంటి నిలిచినా...
జిల్లా నుంచి టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి ఒక్కరే కిరణ్ వర్గంలో కనిపించారు. సీఎం పదవికి రాజీనామా చేసిన సమయంలో ఆయనతోనే ఉన్నారు. కానీ భారతి వల్ల కిరణ్‌కు జిల్లాలో రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం లేదన్నది నిర్వివాదాంశం. సొంత నియోజకవర్గంలోనే ఆమె రాజకీయంగా పట్టు కోల్పోయారు. వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన భర్త కిల్లి రామ్మోహన్‌రావు పోటీ చేస్తారని కేంద్ర మంత్రి కృపారాణి ఇప్పటికే ప్రకటించారు. దాంతో కాంగ్రెస్ టిక్కెట్టు భారతికి రానట్లేనని తేలిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలలో ఆమెకు అవకాశాల్లేవు. దాంతో మరో దారిలేక ఎమ్మెల్యే భారతి కిరణ్ వర్గంలో కొనసాగాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ పరిణామాలతో జిల్లాలో కిరణ్ వర్గం ఉనికి కనిపించే అవకాశాల్లేవని స్పష్టమైపోయింది. కొత్త పార్టీ పెట్టినా... ప్రత్యేకవర్గంగా కొనసాగినా కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపించలేరని పరిశీలకులు తేల్చేస్తున్నారు.