
ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి: శోభానాగిరెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అరెస్ట్కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. ఆయన ఆధీనంలోనే హొం శాఖ ఉందని తెలిపారు. విజయమ్మ పర్యటనను అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. విజయమ్మ అరెస్ట్కు నిరసన తెలిపేందుకు ఆ పార్టీ నేతలు డిజిపి ప్రసాదరావును కలిశారు. అనంతరం శోభానాగిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. బాధితులను పరామర్శించేందుకే ఆమె పర్యటిస్తున్నారని, ఎవరినో రెచ్చగొట్టడానికి కాదని తెలిపారు.
వైఎస్ రాజశేఖర రెడ్డిని అభిమానించే ప్రజలు కోట్ల మంది తెలంగాణలో ఉన్నారన్నారు. ప్రజలు ఎవరూ ఆమెను అడ్డుకోలేదని తెలిపారు. మంత్రులు జానారెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డి రెచ్చగొట్టేవిధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని ఆమె ప్రశ్నించారు. మొన్న సమైక్య శంఖారావం బహిరంగ సభ హైదరాబాద్లో శాంతియుతంగా నిర్వహించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
బాధలలో ఉన్న ప్రజలను పరామర్శించడానికి వెళుతున్న ఒక పార్టీ నాయకురాలిని అరెస్ట్ చేసి తీసుకురావడం ఏమిటని ఆ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. డిజిపిని కలిసినవారిలో ప్రవీణ్ కుమార్ రెడ్డి, జనక్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.