జగన్ ప్రగాఢ సానుభూతి
- శోభకు పుష్పాంజలి ఘటించిన జగన్, విజయమ్మ, భారతి, షర్మిల
- నివాళులర్పించిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు
ఆళ్లగడ్డ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రోడ్డు ప్రమా దంలో మరణించిన వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి కుటుంబసభ్యులకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జగన్ హైదరాబాద్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3.15 గంటలకు హెలికాప్టర్‌లో ఆళ్లగడ్డకు చేరుకున్నారు. ఆయనతో పాటు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, సోదరి షర్మిల, జగతి పబ్లికేషన్స్ చైర్‌పర్సన్ వైఎస్ భారతి, చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వచ్చారు. నివాస ప్రాంగణంలో ఉంచి న శోభ భౌతిక కాయానికి తొలుత జగన్ పుష్పాంజలి ఘటించారు. అప్పటికే శోకసంద్రంలో మునిగి ఉన్న శోభ కుటుంబీకులు జగన్, విజయమ్మలను చూడగానే గుండెలవి సేలా విలపించారు. శోభ మృతితో పూర్తిగా డీలాపడిపోయిన భర్త భూమా నాగిరెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. శోభ కుమార్తెలు, కుమారుడిని జగన్ అక్కున చేర్చుకుని ఓదార్చారు. విజయమ్మ కూడా ఆ పిల్లలను అనునయించారు. ఇలాంటి సమయంలో గుండె నిబ్బరంతో వ్యవహరించాలంటూ నాగిరెడ్డికి జగన్ ధైర్యం చెప్పారు. విజయమ్మ, షర్మిల, భారతి కంటతడిపెడుతూ శోభ తలను నిమిరినప్పుడు అక్కడున్న మహిళలు పెద్దపెట్టున రోదించారు. పది నిమిషాలకు పైగా శోభ భౌతికకాయం వద్ద ఉన్న జగన్, విజయమ్మ, షర్మిల, భారతి తదితరులు తర్వాత భూమా నివాసంలోకి వెళ్లి శోభ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శోభ తండ్రి ఎస్‌వీ సుబ్బారెడ్డి, సోదరుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, ఇతర కుటుంబసభ్యులతో జగన్ 45 నిమిషాలకు పైగా గడిపి వారికి ధైర్యం చెప్పారు. శోభలాంటి ఆత్మీయురాలిని కోల్పోవడం తనకు చాలా బాధగా ఉందని, ఆమె లేరనే వాస్తవాన్ని జీర్ణించుకుని ఇకపై జరగాల్సింది చూడాలని వారికి చెప్పారు. ఆ కుటుంబానికి తన సహాయసహకారాలు ఉంటాయని జగన్ భరోసా ఇచ్చారు. తర్వాత శోభ తుదియాత్ర కోసం పార్థివదేహాన్ని ప్రత్యేక వాహనంలోకి చేర్చారు. జగన్, విజయమ్మ, షర్మిల, భారతి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి శోభకు పుష్పాంజలి ఘటించారు. సాయంత్రం 4.15 గంటలకు జగన్ కుటుంబసభ్యులతో కలసి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు.
ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, తిమ్మల్లి రామకృష్ణారెడ్డి, కాటసాని రామిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, కేతినేని వెంకట్రామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథరెడ్డి, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, ఎం.లింగారెడ్డి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎంపీలు ఎస్పీవై రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, అనంతపురం మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తోపుదుర్తి కవిత, కడప, రాజంపేట లోక్‌సభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వైఎస్ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, నాయకులు కొణతాల రామకృష్ణ, వైఎస్ వివేకానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, మాజీ మంత్రి టి.రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకు లు డి.సి.గోవిందరెడ్డి, రెహమాన్, రాచమల్లు ప్రసాదరెడ్డి, జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ సహా పలువురు నేతలు శోభకు శ్రద్ధాంజలి ఘటించారు.
అంత్యక్రియల కార్యక్రమంలో ఆళ్లగడ్డ, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, కడప, హైదరాబాద్ ప్రాంతానికి చెందిన నేతలు భారీగా హాజరయ్యారు. నందికొట్కూరు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు డాక్టర్ నౌమాన్, రామకృష్ణా విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, శ్రీశైలం వైఎస్సార్‌సీపీ నేత బుడ్డా సీతారామరెడ్డి, కేశవరెడ్డి విద్యాసంస్థల చైర్మన్ కేశవరెడ్డి, కోవెలకుంట్ల నేత కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ సి.నారాయణరెడ్డి, కాకనూరు పరమేశ్వరరెడ్డి, వైఎస్సార్‌సీపీ కోడుమూరు ఇన్‌చార్జి మణిగాంధీ, కొప్పులు శివనాగిరెడ్డి తదితరులు హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీ సేవాదళ్ కార్యకర్తలు సందర్శనకు వచ్చిన వారికి సహాయపడ్డారు.