సాక్షి ప్రతినిధి, కాకినాడ :
భారీ వర్ష బాధితులను పరామర్శించేందుకు పక్షం రోజుల కిందటే జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రచ్చబండలో పాల్గొనేందుకు మళ్లీ నేడు జిల్లాకు వస్తున్నారు. ఆయన క్రితంసారి బాధితులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదు. ‘మాటలు కోటలు దాటినా చేతలు గడప దాటని’ చందంగా ముఖ్యమంత్రి ఏం చెప్పినా తమకు మేలు జరగలేదని బాధితులు నిష్టూరమాడుతున్నారు. ఈసారైనా ఆయన మాటలు చేతలుగా మారాలని ఆశ పడుతున్నారు.
భారీ వర్షాలతో జిల్లాలో వరి, పత్తి, ఉల్లి, కూరగాయల రైతులకు, చేనేత, మత్స్యకార వర్గాలకు నష్టం వాటిల్లింది. ఇళ్లు నేలమట్టమై రోడ్డునపడ్డ కుటుంబాలు మూడువేలకు పైనే ఉన్నాయి. కళ్లెదుటే సర్వం కోల్పోయినా అంచనాలు, అధ్యయనాలు అంటూ సర్కార్ కనికరం చూపలేదు. ఇళ్లు కూలిపోయిన కుటుంబాలకు ఇంతవరకు చిల్లిగవ్వ ఇవ్వలేదు సరికదా ప్రజాపంపిణీ ద్వారా కేజీ బియ్యం కూడా విదిల్చే మానవత్వం ప్రభుత్వానికి లేకుండా పోయిందని బాధిత కుటుంబాలు విలపిస్తున్నాయి. మండల స్థాయిలో దెబ్బతిన్న ఇళ్లు లెక్క తేల్చినా పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. ఇక వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి చేతికొచ్చిన పంట చేలల్లోనే కుళ్లిపోగా కొందరు రైతులు ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నారంటే జిల్లాలో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెపుతోంది.
ఇవీ క్రితం సారి కిరణ్ హామీలు..
నష్టపోయిన రైతులను పలకరించేందుకు జిల్లాకు వచ్చిన సీఎం గొల్లప్రోలులో మాట్లాడుతూ అనేక హామీలు గుప్పిం చారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి తక్షణ సాయంగా దుస్తులు, వంటపాత్రలకు ఇచ్చే సాయాన్ని మూడు వేల నుంచి ఐదువేలకు పెంచామన్నారు. మగ్గాలు దెబ్బతిన్న చేనేత కుటుంబాలకు ఐదువేలు ఇస్తామన్నారు. నూలు, ఇతర రసాయనాల విలువను బట్టి మరో ఐదు వేలు తక్షణం ఇస్తామని ఉదారంగా ప్రకటించారు. అయితే పక్షం రోజులైనా బాధితులకు ప్రభుత్వం నుంచి చిల్లిగవ్వ రాలేదు. వంట పాత్రల మాట దేవుడెరుగు కనీసం కిరోసిన్ కూడా ఇవ్వలేకపోయారు. బాధితుల కోసం లక్షా 56 లీటర్ల కిరోసిన్ విడుదలచేశామని జిల్లా యంత్రాంగం లెక్కలు మాత్రం చెబుతోంది. ఒక్క బాధిత కుటుంబానికి ఒక్క లీటరు కిరోసిన్, పిడికెడు బియ్యం ఇచ్చి న దాఖలా లేదు. ఒక్క ఇంటికీ నష్టపరిహారం ఇవ్వలేదు.
ఇప్పటికీ పూర్తి కాని సర్వే
జిల్లాలో వరి, పత్తి, అరటి, ఉల్లి, బొప్పాయి, కూరగాయలు, పూలతోటలు అన్నీ కలిపి మూడున్నర లక్షల ఎకరాల్లోని పంట పాడైంది. వరికి ఎకరాకు పాతికవేలు పైబడి పెట్టుబడులు పెట్టిన రైతులు ముసురు మిగిల్చిన నష్టంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు అన్ని రకాల పంటలు పండించే రెండున్నర లక్షల మంది రైతులు సాయం కోసం సర్కార్ వైపు చూస్తున్నారు. కానీ జిల్లాలో నష్టం అంచనాలే ఇంకా పూర్తి కాలేదు. వాస్తవానికి ఈ నెల 16 (శనివారం) నాటికి పంట నష్టంపై సర్వే నూరుశాతం పూర్తి చేయాల్సి ఉండగా శుక్రవారం నాటికి 70 శాతం నష్టాలను మాత్రమే నమోదు చేసినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.
ఇంతవరకు సర్వే పూర్తి చేసిన భూముల్లో 38 వేల హెక్టార్‌లలో వరి పంట నష్టపోయినట్టు లెక్కతేలిందంటున్నారు. మొత్తం సర్వే పూర్తి చేసేందుకు మరో వారం రోజులు సమయం పడుతుందని లెక్కలేస్తున్నారు. సర్వే ఎప్పటికి పూర్తి అవుతుంది, తమకు సాయం ఎప్పటికి అందుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు బాధితులకు తక్షణ సాయం అందించే పరిస్థితి ఉండేది. కానీ ఈ సర్కారు హయాంలో తక్షణ సాయం మాట అటుంచి ఏళ్లూ పూళ్లూ పడుతుందని నీలం నష్ట పరిహారం నిర్వాకమే చాటింది. నేడు జిల్లాకు రానున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈసారైనా వట్టిమాటలు కాక గట్టిచేతలు తలపెట్టి, తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని భారీవర్ష బాధితులు ఆశిస్తున్నారు.
నేడు మరోసారి జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి
Published Sat, Nov 16 2013 3:34 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement