మండల పరిధిలోని చిల్లకల్లులో ఈ నెల 16న జరగనున్న రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హాజరు కానుండటంతో జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు అధికారులతో కలసి గురువారం ఏర్పాట్లు పరిశీలించారు
చిల్లకల్లు (జగ్గయ్యపేట), న్యూస్‌లైన్ :
మండల పరిధిలోని చిల్లకల్లులో ఈ నెల 16న జరగనున్న రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హాజరు కానుండటంతో జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు అధికారులతో కలసి గురువారం ఏర్పాట్లు పరిశీలించారు. ముందుగా మండల పరిషత్ కార్యాలయం పక్కన ఉన్న సంతలో ఏర్పాటు చేస్తున్న సభావేదికను, ఎస్‌జీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో జరగనున్న రచ్చబండ కార్యక్రమానికి జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలతో పాటు పేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు హాజరుకావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రభాకరరావు, జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి, సబ్ కలెక్టర్ దాసరి హరిచందన, వ్యవసాయ శాఖ జేడీ బాలునాయక్, డ్వామా పీడీ అనీల్ కుమార్, యువజన, క్రీడల శాఖ (కృషి) సీఈఓ శ్రీనివాసరావు, డీఆర్‌డీఏ పీడీ శివశంకర్, జిల్లా వైద్యాధికారి సరసిజాక్షి, జిల్లా పంచాయతీ అధికారి ఆనంద్, డీసీసీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
సీఎం పర్యటన ఇలా..
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 16న ఉదయం 10.30 గంటలకు చిల్లకల్లు రచ్చబండ కార్యక్రమానికి హాజరవుతారని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం వరకు కార్యక్రమంలో పాల్గొంటారని, అనంతరం జగ్గయ్యపేటలోని ఎస్‌జీఎస్ కళాశాలకు రోడ్డుమార్గాన వస్తారని చెప్పారు. అక్కడినుంచి హైదరాబాద్ వెళతారని అధికారులు తెలిపారు.