అధికారంలో ఉంటే ఏమేమి చేయవచ్చో కాంగ్రెస్ నేతలు చేసి చూపిస్తున్నారు. రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదువా అన్నట్లు ముఖ్యమంత్రి అండతో రూ. కోట్ల పనులను అడ్డదారిలో దక్కించుకుంటున్నారు.
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : అధికారంలో ఉంటే ఏమేమి చేయవచ్చో కాంగ్రెస్ నేతలు చేసి చూపిస్తున్నారు. రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదువా అన్నట్లు ముఖ్యమంత్రి అండతో రూ. కోట్ల పనులను అడ్డదారిలో దక్కించుకుంటున్నారు. అభివృద్ధి పనుల కేటాయింపులపై ముఖ్యమంత్రికి విచక్షణాధికారం ఉన్నప్పటికీ దానిని దుర్వినియోగం చేస్తున్నారు.
స్థానిక ఎమ్మెల్యేను కాదని అధికార పార్టీ నేతలకు రూ.కోట్ల పనులను అప్పనంగా అప్పగిస్తున్నారు. రాజంపేటలో అధికార పార్టీ నేత మేడా మల్లికార్జునరెడ్డి పేరుతో రూ. 2కోట్ల స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌నిధులను కేటాయిస్తూ ఈనెల 17వ తేదీన ఏకంగా జీఓ జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బద్వేలు నియోజకవర్గ పరిధిలో రూ.2.83కోట్లను అక్కడి స్థానిక ఎమ్మెల్యే పీఎం కమలమ్మ ప్రతిపాదనలను అనుసరించి మంజూరు చేశారు. రాజంపేట నియోజకవర్గ పరిధిలో ఇదే రీతిలో స్థానిక ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ప్రతిపాదనలను అనుసరించి స్పెషల్ డెవలప్‌మెంట్ నిధులను కేటాయించాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ నిధులను స్థానిక ఎమ్మెల్యేలకే కేటాయించారు.
ఒక్క రాజంపేట నియోజకవర్గంలో మాత్రం అక్కడి ఎమ్మెల్యేకు నిధులు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రికి మనసు అంగీకరించలేదు. అధికార పార్టీలో కొనసాగుతున్న మేడా మల్లికార్జునరెడ్డి ప్రతిపాదించిన 75 పనులకు సంబంధించి రూ. 2కోట్లను ముఖ్యమంత్రి దారాళంగా మంజూరు చేయడం విమర్శలకు తావిస్తోంది. కాంగ్రెస్‌పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న నాయకులందరికీ న్యాయం చేస్తున్నారా అంటే అదీ లేదు. కేవలం ఒక్క నాయకుడికి రూ. 2కోట్ల పనులను అప్పగించడంపై కాంగ్రెస్ నాయకులు కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు.